Pawan Kalyan: మనిషికి మరపు సహజం... కానీ...!: పవన్ కల్యాణ్

Pawan Kalyan pays tributes to Potti Sriramulu on his death anniversary

  • నేడు పొట్టి శ్రీరాములు వర్ధంతి
  • ఆత్మార్పణ దినంగా పరిగణిస్తున్న ఏపీ ప్రభుత్వం
  • విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్యక్రమం
  • హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసిన పవన్ కల్యాణ్ ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు ఒక జాతికి, ఒక కులానికి నాయకుడు కాదని... ఆయన ఆంధ్ర జాతికి నాయకుడు అని కీర్తించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించాలంటే  ఆర్య వైశ్య సమాజానికి వెళ్లే అవసరం లేకుండానే ఆయనను గౌరవించుకునేలా ఉండాలని పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సభలో ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని తెలిపారు. 

"మనిషికి మరపు సహజం. మనకు అన్నం పెట్టినవారిని, మనకు తోడుగా నిలిచిన వారిని, మనకు అండగా నిలబడిన వారిని మర్చిపోతారు... కానీ అలాంటి వారిని గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. మనం ఎక్కడ్నించి వచ్చాం అనేది మర్చిపోకూడదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం విలువ ఏంటో అర్థమైంది. 

పొట్టి శ్రీరాములు 56 రోజుల పాటు కఠోర ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఆంధ్ర రాష్ట్రం సాకారమయ్యేలా చేశారు. కానీ పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం తర్వాత ఆయన భౌతికకాయాన్ని మోయడానికి నలుగురు కూడా లేని పరిస్థితి బాధాకరం. ఘంటసాల వంటి మహానుభావులు కొంతమంది ఆ రోజు ముందుకొచ్చారు. 

ఆయన త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్రం. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం ప్రతి తరానికి గుర్తుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మాకు క్యాబినెట్ సమావేశంలో చెప్పారు. ఆ మహనీయుడి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అంటూ పవన్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News