telangana govt: తెలంగాణ అసెంబ్లీలో క్రీడా వర్శిటీ బిల్లు
- నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు
- ఈ సమావేశాల్లోనే ఆర్ఓఆర్ 2024 కొత్త చట్టాన్ని తీసుకురానున్న ప్రభుత్వం
- నేడు పర్యాటక విధానంపై శాసనసభ, శాసనమండలిలో స్వల్పకాలిక చర్చ
శాసనసభ సమావేశాలు ఈరోజు నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఆ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల ప్రసంగాల అనంతరం స్పీకర్ సభలను 16వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాల అనంతరం పలు సంతాప తీర్మానాలను ప్రవేశపెడతారు.
ఆ తర్వాత, తెలంగాణ యువ భారత వ్యాయామ విద్య, క్రీడా విశ్వవిద్యాలయం బిల్లు, తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చను చేపడతారు. శాసనమండలిలో కూడా ఇదే అంశంపై చర్చ జరగనుంది.
కాగా, శాసనసభను, మండలిని ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి? అనేది ఈ రోజు జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయిస్తారు. వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లోనే ఆర్ఓఆర్ 2024 కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. రైతు భరోసా విధి విధానాలపైనా చర్చించనున్నట్లు తెలిసింది.