Cricket: వర్షం కారణంగా గబ్బా టెస్టు రద్దయితే.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుందా?
- గబ్బా టెస్ట్ రద్దయితే ఆసక్తికరంగా మారనున్న సమీకరణాలు
- తదుపరి రెండు టెస్టుల్లో విజయం సాధిస్తే నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్
- సిరీస్‌ను కోల్పోతే గల్లంతు కానున్న అవకాశాలు
- ఆస్ట్రేలియా-శ్రీలంక టెస్ట్ సిరీస్ ఫలితం భారత్‌పై ప్రభావం చూపే ఛాన్స్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 సైకిల్‌లో (డబ్ల్యూటీసీ) టెస్ట్ సిరీస్ షెడ్యూల్స్ ముగింపు దశకు చేరుకుంటుండడంతో ఫైనల్‌కు చేరే రెండు జట్లపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత సమీకరణాల ప్రకారం చూస్తే దక్షిణాఫ్రికా, భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు రేసులో ముందు వరుసలో కనిపిస్తున్నాయి. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉండగా ఆస్ట్రేలియా, భారత్, శ్రీలంక జట్లు వరుసగా రెండవ, మూడవ, నాలుగవ స్థానాల్లో ఉన్నాయి.
ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లో 1-1తో ఇరు జట్లు సమంగా ఉండగా... బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ప్రస్తుతం మూడవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. అయితే, వర్షం కారణంగా ఈ మ్యాచ్ తొలి రోజు ఆట కొద్ది సమయం మాత్రమే జరిగింది. రెండవ రోజు ఆటకు వాతావరణం అనుకూలించినా, మూడవ రోజు మళ్లీ వర్షం కారణంగా అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఇక రానున్న రెండు మూడు రోజుల్లో కూడా బ్రిస్బేన్‌లో వర్షాలు కురిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఒకవేళ ప్రతికూల వాతావరణం కారణంగా గబ్బా టెస్ట్ పూర్తిగా రద్దైతే డబ్ల్యూటీసీ ఫైనల్ సమీకరణాలు ఏవిధంగా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.
గబ్బా టెస్ట్ రద్దైతే సమీకరణాలు ఇవే
వర్షం కారణంగా గబ్బా టెస్ట్ మ్యాచ్ రద్దైనా లేక మ్యాచ్ డ్రాగా ముగిసినా భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే సమీకరణాలు ఆసక్తికరంగా మారతాయి. మెల్‌బోర్న్, సిడ్నీ వేదికలుగా జరగనున్న తదుపరి రెండు టెస్టుల్లోనూ భారత్ విజయం సాధిస్తే ఇతర ఫలితాలతో సంబంధం లేకుండా భారత్ నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
ఒకవేళ ఆసీస్‌పై భారత్ 2-1 తేడాతో సిరీస్‌ను గెలుచుకుంటే... ఈ సిరీస్ తర్వాత జరిగే సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో శ్రీలంక వైట్‌వాష్‌కు గురికాకుండా ఉంటే సరిపోతుంది. భారత్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అదే భారత్-ఆస్ట్రేలియా సిరీస్ 2-2తో డ్రా అయితే మాత్రం ఆసీస్‌పై శ్రీలంక టెస్ట్ సిరీస్ గెలిస్తేనే భారత్‌కు మార్గంసుగుమం అవుతుంది.
అనూహ్యంగా భారత్-ఆసీస్ సిరీస్ 1-1తో సమం అయితే... శ్రీలంక-ఆస్ట్రేలియా సిరీస్ కూడా డ్రా అవ్వాలి లేదా ఆస్ట్రేలియాను శ్రీలంక ఓడించాలి. ఈ సమీకరణాల్లో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుంది. ఒకవేళ ఆస్ట్రేలియా చేతిలో భారత్ టెస్ట్ సిరీస్‌ను కోల్పోతే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకునే దారులు మూసుకుపోతాయి.