Beggar: ఆ సిటీలో జనవరి 1 నుంచి భిక్షాటన నిషేధం... భిక్షగాళ్లకు డబ్బులిచ్చిన వారిపై కేసు

Those Who Give Money To Beggars Will Face Police Case In This City
  • కొత్త ఏడాది నుంచి ఇండోర్‌లో భిక్షాటనపై నిషేధం
  • యాచకులకు సాయం చేసే వారిపై చర్యలు ఉంటాయన్న అధికారులు
  • భిక్షాటన చేసే వారిలో కొంతమందికి ఇళ్లు, పిల్లలకు ఉద్యోగాలు ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో 2025 జనవరి 1 నుంచి భిక్షాటన చేసే వారికి ఎవరైనా డబ్బులు ఇస్తే కేసు నమోదు చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు. యాచకులు లేని నగరంగా ఇండోర్‌ను తీర్చిదిద్దాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంగ్ల నూతన సంవత్సరాది నుంచి భిక్షాటనను నిషేధించారు. యాచకులకు సాయం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.

భిక్షాటన చేసేవారికి డబ్బులు ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని అధికారులు ప్రకటించారు. నగరాన్ని యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు ఈ దిశగా అడుగు వేసినట్లు ఇండోర్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ వెల్లడించారు. డిసెంబర్ చివరి నాటికి అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. భిక్షాటన చేసే వారికి ఎవరూ ఎలాంటి సాయం చేయవద్దని, వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు.

యాచకులు లేని నగరాలను తీర్చి దిద్దాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా 10 నగరాల్లో పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

ఇండోర్ అధికారులు భిక్షాటన చేసే వారిపై దృష్టి సారించారు. భిక్షాటన చేసే వారి గురించి వారు ఆశ్చర్యకరమైన విషయాలను గుర్తించారు. భిక్షాటన చేసే వారిలో కొంతమందికి పక్కా ఇళ్లు ఉన్నాయని, మరికొందరి పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడ్డారని గుర్తించారు. అందుకే అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా భిక్షాటనను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. భిక్షాటన చేసే వారిని పునరావాస కేంద్రానికి తరలిస్తామని ప్రాజెక్ట్ ఆఫీసర్ దినేశ్ మిశ్రా తెలిపారు.
Beggar
Indore
Madhya Pradesh

More Telugu News