president droupadi murmu: నేటి నుంచి బొల్లారంలో రాష్ట్రపతి శీతాకాల విడిది
- నేటి సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకోనున్న రాష్ట్రపతి ముర్ము
- ఈ నెల 21 వరకూ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో బస
- రాష్ట్రపతి నిలయంలో ఈ నెల 20న ఎట్ హోం
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిది కోసం నేడు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వస్తున్నారు. ఈ నెల 21వ తేదీ వరకూ ఇక్కడ బస చేయనున్న రాష్ట్రపతి ముర్ము వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ రోజు ఏపీలో పర్యటన ముగిసిన తర్వాత రాష్ట్రపతి ముర్ము.. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేటలోని వాయుదళ శిక్షణ కేంద్రానికి సాయంత్రం 5.15 గంటలకు చేరుకుంటారు.
అక్కడ గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు, అధికారులు రాష్ట్రపతికి ఆహ్వానం పలికి పరిచయం చేసుకుంటారు. అనంతరం ద్రౌపదీ ముర్ము భారీ కాన్వాయ్‌తో రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. కాగా, బుధవారం రాష్ట్రపతి నిలయంలో పలు అభివృద్ధి పనులను ముర్ము ప్రారంభిస్తారు. 20న (శుక్రవారం) రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం, అధికారులు, పౌరులతో ఎట్ హోం నిర్వహిస్తారు.
ఈ రోజు ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొననున్న విషయం తెలిసిందే. ఇక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆమె హైదరాబాద్ కు బయలుదేరనున్నారు.