Perni Nani: రేషన్ బియ్యం మాయం కేసు.. పేర్ని నాని కుటుంబంపై లుక్ అవుట్ నోటీసులు!

Police issue look out notices against ex minister Perni Nani family
  • గోదాము నుంచి 3,708 బస్తాల రేషన్ బియ్యం మాయం
  • కేసు నుంచి బయటపడేందుకు రూ. 1.7 కోట్ల జరిమానా చెల్లించిన నాని కుటుంబం
  • నాని భార్య బెయిలు దరఖాస్తు గురువారానికి వాయిదా
  • విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసుల జారీ
రేషన్ బియ్యం మాయం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పేర్ని నాని కుటుంబంపై లుక్ అవుట్ నోటీసు జారీ అయింది. వారు దేశం విడిచి పారిపోకుండా పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో నిందితులు దరఖాస్తు చేసుకున్న బెయిలు పిటిషన్ నిన్న విచారణకు వచ్చినప్పటికీ తిరిగి 19వ తేదీకి వాయిదా పడింది. కాగా, మాయమైన బియ్యం విలువకు సంబంధించి జరిమానాతో కలిపి డబ్బులు కట్టాలన్న అధికారుల నోటీసుకు స్పందించిన నాని కుటుంబం తొలి విడతలో ఈ నెల 13న కోటి రూపాయల విలువైన మూడు డీడీలు సమర్పించింది. నిన్న మరో రూ. 70 లక్షల డీడీలు ఇచ్చారు. మొత్తంగా రెండు విడతల్లో కలిపి ఇప్పటి వరకు రూ. 1.7 కోట్ల డీడీలు అధికారులకు అందించారు. 

జరిమానా చెల్లించే అవకాశం ఇవ్వడం ద్వారా పేర్ని నాని కుటుంబానికి అధికారులు ఈ కేసు నుంచి బయటపడే అవకాశం కల్పించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, మొత్తం 3,708 బస్తాల రేషన్  బియ్యం మాయమైనట్టు చెబుతున్నా, ఆ సంఖ్య అంతకుమించే ఉంటుందని అంటున్నారు. వాస్తవంగా ఎన్ని బస్తాలు మాయమై ఉంటాయన్న విషయంలో నేడు ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

రేషన్ బియ్యం మాయమైన కేసులో ఈ నెల 10న గోదాము యజమాని జయసుధ, మేనేజర్ మానస్ తేజపై పోలీసులు కేసు నమోదు చేశారు. జయసుధ ఈ నెల 13న బెయిలు కోసం దరఖాస్తు చేయగా, విచారణ గురువారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న జయసుధ విదేశాలకు పారిపోకుండా పోలీసులు తాజాగా లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు. కాగా, మాయమైన బియ్యం విలువకు సంబంధించి పేర్ని నాని కుటుంబం రూ. 1.7 కోట్లు చెల్లించిన నేపథ్యంలో నాని నిన్న అజ్ఞాతం వీడి బయటకు వచ్చారు. తన నివాసంలో మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, జోగి రమేశ్, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తదితరులతో సమావేశమయ్యారు.
Perni Nani
Perni Jayasudha
Ration Rice Scam
Andhra Pradesh
Look Out Notices
YSRCP

More Telugu News