Student Suicide: నారాయణ స్కూలులో ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య

Seventh Class Student Committed Suicide In Narayana School At Hayath Nagar
  • హయత్ నగర్ లో సోమవారం అర్ధరాత్రి ఘటన
  • స్కూలు ముందు విద్యార్థి కుటుంబ సభ్యుల ఆందోళన
  • ఫిజిక్స్ సార్ వేధింపులే కారణమని ఆరోపణ
నారాయణ హైస్కూలులో దారుణం జరిగింది. క్లాస్ లీడర్ తో ఫిజిక్స్ టీచర్ కొట్టించాడనే ఆవేదనతో ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ రూంలో ఉరి వేసుకుని చనిపోయాడు. సోమవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకోగా.. యాజమాన్యం తమకు సమాచారం ఇవ్వలేదని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కొడుకు మరణానికి న్యాయం చేయాలంటూ బంధువులతో కలిసి నారాయణ స్కూలు ముందు ఆందోళనకు దిగారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్ శివారు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ రెసిడెన్షియల్ స్కూలులో లోహిత్ ఏడో తరగతి చదువుతున్నాడు. సోమవారం క్లాస్ రూంలో ఫిజిక్స్ టీచర్ లోహిత్ ను మందలించాడు. క్లాస్ లీడర్ తో లోహిత్ ను కొట్టించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన లోహిత్.. హాస్టల్ రూంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో ఉరి వేసుకున్నాడు. తోటి విద్యార్థులు గమనించి వార్డెన్ కు చెప్పగా.. లోహిత్ ను కిందకు దించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే, అప్పటికే లోహిత్ చనిపోవడంతో స్కూలు యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది.

లోహిత్ తల్లిదండ్రులు వనపర్తి జిల్లా రేవల్లి మండలం శానాయిపల్లి గ్రామంలో నివసిస్తున్నారు. కొడుకు చనిపోయిన విషయం పోలీసులు చెబితేనే తమకు తెలిసిందని, స్కూలు యాజమాన్యం తమకు సమాచారం ఇవ్వలేదని లోహిత్ తండ్రి మధుసూదన్ రెడ్డి చెప్పారు. ఫిజిక్స్ టీచర్ వేధింపుల వల్లే తన కొడుకు చనిపోయాడని, ఆ టీచర్ తో పాటు స్కూలు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Student Suicide
Narayana School
Hostel Student
Hayat Nagar
Hyderabad

More Telugu News