K Kavitha: మూసీ అభివృద్ధి అంశంపై ప్రభుత్వంపై కవిత ప్రశ్నల వర్షం

Kavitha questions government on Musi development

  • ఇళ్లను కూలగొట్టి... ఈఎంఐలు ప్రభుత్వం చెల్లిస్తుందా? అని నిలదీత
  • సభను తప్పుదోవ పట్టిస్తే ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతామని హెచ్చరిక
  • మూసీ నిర్వాసితుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించాలన్న కవిత

మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. మూసీ అభివృద్ధి కోసం మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ ద్వారా డీపీఆర్ చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు శాసనమండలిలో తెలిపారు. దీంతో కవిత ప్రశ్నలు సంధించారు.

మూసీ అభివృద్ధి పేరిట ఆ ప‌రివాహ‌క ప్రాంతంలో కూల‌గొట్టిన ఇళ్ల‌కు ఈఎంఐలు ఉంటే ప్ర‌భుత్వం చెల్లిస్తుందా? అని ప్ర‌శ్నించారు. మూసీ నది విషయంలో డీపీఆర్ ఆధారంగా అంచనా వ్యయాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోందని, కానీ రూ.4,100 కోట్లు కావాలని ప్రపంచ బ్యాంకును ప్రభుత్వం ఆశ్రయించినట్లు తమకు నిర్ధిష్టమైన సమాచారం ఉందన్నారు.

ప్రపంచ బ్యాంకును ప్రభుత్వం ఆశ్రయించిన విషయం వాస్తవమా కాదా? డీపీఆర్ తయారు కాలేదని ప్రభుత్వం ఈ రోజు సభకు చెప్పిందన్నారు. ఏ తేదీన ప్రపంచ బ్యాంకు సాయం కోరుతూ ప్రతిపాదనలు పంపించారని ప్రశ్నించారు. మూసీ కోసం రూ.14,100 కోట్ల వ్యయం అవుతుందని, నిధులతో పాటు అనుమతులు ఇప్పించాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఏ ప్రాతిపదికన అడిగారని ప్రశ్నించారు.

ఒకవేళ కేంద్రాన్ని, ప్రపంచ బ్యాంకును సాయం కోరడం వాస్తవమైతే సభను, ప్రజలను ఎందుకు తప్పదోవపట్టిస్తున్నారు? అని నిలదీశారు. సభను తప్పదోవ పట్టిస్తే... అవసరమైతే ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెడుతామని హెచ్చ‌రించారు. మూసీ నదీ గర్భంలో నివసించే 309 కుటుంబాలు వాళ్లంతట వాళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతోందని, కానీ హృదయవిదారకమైన వీడియోలను చూస్తే ప్రభుత్వం చెబుతున్నది అవాస్తవమని తెలుస్తోందన్నారు.

ఆ కుటుంబాలు వెళ్లిపోవడానికి సమ్మతిస్తూ ఏవైనా పత్రాలపై సంతకాలు చేసి ఉంటే అవి సభకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 181 కుటుంబాలు తామంతట తామే కూల్చేసుకొని వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతోందని, ఇది వినడానికి హాస్యాస్పదంగా ఉందన్నారు. మూసీ నిర్వాసితుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News