KTR: సోషల్ మీడియానే తట్టుకోలేని రేవంత్ రెడ్డికి కేసీఆర్ అవసరమా?: కేటీఆర్
- కాంగ్రెస్ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్న కేటీఆర్
- 100 శాతం రుణమాఫీ నిజమైతే రాజకీయ సన్యాసానికి సిద్ధమని సవాల్
- రేవంత్ రెడ్డికి ఓటేసినందుకు కొడంగల్ ప్రజలు బాధపడుతున్నారన్న కేటీఆర్
బీఆర్ఎస్ సోషల్ మీడియా బృందాన్నే తట్టుకోలేని సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ అవసరమా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఈ హామీలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కొడంగల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... వంద శాతం రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతోందని, అదే నిజమైతే తాను రాజకీయ సన్యాసానికి సిద్ధమని సవాల్ చేశారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ చేశామని నిరూపించాలన్నారు. రూ.12 వేల కోట్లకు మించి రైతు రుణమాఫీ కాలేదన్నారు.
లగచర్ల ఘటనలో అమాయక రైతులను, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి 35 రోజులు అవుతోందన్నారు. పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. రేవంత్ రెడ్డికి ఓటేసి గెలిపించినందుకు కొడంగల్ నియోజకవర్గ ప్రజలు బాధపడుతున్నారన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఎవరూ సంతోషంగా లేరని కేటీఆర్ అన్నారు.