Australia vs India: బ్రిస్బేన్ టెస్టు.. భారత్ 260 ఆలౌట్.. ఆసీస్‌కు భారీ ఆధిక్యం!
- బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆసీస్ మూడో టెస్టు
- తొలి ఇన్నింగ్స్‌లో 260 రన్స్‌కు టీమిండియా ఆలౌట్
- ఆస్ట్రేలియాకు 185 పరుగుల లీడ్
- ఆఖరి వికెట్‌కు బుమ్రా, ఆకాశ్ దీప్ ద్వయం 47 పరుగుల భాగస్వామ్యం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 260 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు ఆసీస్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆతిథ్య జట్టుకు 185 పరుగుల లీడ్ లభించింది. ఓవర్ నైట్ స్కోర్ 252/9 తో ఐదో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మరో 8 పరుగులు జోడించి ఆఖరి వికెట్ కోల్పోయింది.
ఆఖరి వికెట్‌కు బుమ్రా (10), ఆకాశ్ దీప్ (31) ద్వయం ఏకంగా 47 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యాన్ని అందించి, జట్టును ఫాలోఆన్ గండం నుంచి గట్టెక్కించింది. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (84), రవీంద్ర జడేజా (77) అర్ధ శతకాలతో రాణించారు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 4, మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా.. జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లైయన్, ట్రావిస్ హెడ్ చెరో వికెట్ తీశారు.
కాగా, భారత్ ఇన్నింగ్స్ ముగిసిన కొద్దిసేపటికే మళ్లీ వరుణుడు ఆటంకం కలిగించడంతో ఆట నిలిచిపోయింది. ఈరోజు ఆఖరి రోజు కావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఇప్పటికే 185 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆసీస్.. రెండో ఇన్నింగ్స్‌లో ధాటిగానే ఆడే ఛాన్స్ ఉంది.
ఎందుకంటే టీమిండియాకు 300 ప్లస్ టార్గెట్ ఇచ్చి, మ్యాచ్‌పై పట్టుబిగించాలని చూసే అవకాశం ఉంది. ఆఖరి రోజు పిచ్ బౌలర్లకు సహకరించే అవకాశాలు ఉంటాయి కనుక భారత బ్యాటర్లపై ఒత్తిడి పెంచే వ్యూహంలో ఆతిథ్య జట్టు ఉంటుంది. వరుణుడు కరుణిస్తే మ్యాచ్‌ను విజయంతో ముగించాలనే ఆసీస్ చూస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.