Prithvi Shaw: 'చెప్పు దేవుడా.. నేనింకా ఏం చేయాలి'.. జట్టు నుంచి తప్పించడంపై పృథ్వీ షా నిర్వేదం!
- టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షాకి మరో ఎదురు దెబ్బ
- విజయ్ హజారే ట్రోఫీ కోసం ముంబయి జట్టులో పృథ్వీకి దక్కని చోటు
- ఇప్పటికే జాతీయ జట్టుకు దూరం.. అటు రంజీ జట్టులో కూడా చోటు కోల్పోయిన వైనం
- ఇటీవల ఐపీఎల్ 2025 మెగా వేలంలో కూడా అన్‌సోల్డ్‌గా మిగిలిన యువ క్రికెటర్
- నిరాశతో తన లిస్ట్-ఏ గణాంకాలను తెలుపుతూ ఇన్‌స్టాలో పోస్టు పెట్టిన పృథ్వీ
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షాకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఒకప్పుడు భారత క్రికెట్‌కు సచిన్ లాంటి ప్లేయర్ దొరికాడని కితాబు అందుకున్న పృథ్వీ ఇప్పుడు రాష్ట్ర జట్టులో చోటు కోసం ఆపసోపాలు పడుతున్నాడు. ఇప్పటికే జాతీయ జట్టుకు దూరమై చాలా కాలం కాగా, ఇటీవల ఐపీఎల్ 2025 మెగా వేలంలో కూడా రూ. 75 లక్షల బేస్ ధరకు అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. అంతకుముందు ముంబయి రంజీ జట్టు నుంచి సైతం ఉద్వాసనకు గురయ్యాడు. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీ కోసం ముంబయి జట్టులో పృథ్వీకి చోటు దక్కలేదు.
తాజాగా ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలోనూ అతడు నిలకడగా రాణించలేకపోయాడు. టోర్నీలో 9 మ్యాచులు ఆడి కేవలం 197 రన్స్ మాత్రమే చేశాడు. అలాగే మధ్యప్రదేశ్‌తో జరిగిన ఫైనల్‌లో ఈ యువ ప్లేయర్ కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ముంబయి జట్టు పృథ్వీ షాపై వేటు వేసింది. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీ మొదటి మూడు మ్యాచులకు ముంబయి జట్టును ప్రకటించింది. ఇందులో అతనికి చోటు కల్పించలేదు.
ఇప్పుడీ తాజా పరిణామంతో పృథ్వీ షా కెరీర్‌కు మరో దెబ్బ తగిలినట్లైంది. ఇక తనను విజయ్ హజారే ట్రోఫీకి ఎంపిక చేయకపోవడంపై తీవ్ర నిరాశకు గురయిన అతడు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో తన గణాంకాలను తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు పెట్టాడు.
"ఇంకా ఏం చూడాలి దేవుడా చెప్పు.. నేను ఇంకా ఎన్ని రన్స్ సాధించాలి. లిస్ట్-ఏ క్రికెట్‌లో 65 ఇన్నింగ్స్‌ల్లో 126 స్ట్రైక్ రేట్, 55.7 సగటుతో 3,399 పరుగులు చేశా. నన్ను ఎంపిక చేయడానికి ఈ గణాంకాలు సరిపోవు. అయినా నీపై నమ్మకం ఉంచుతాను. ప్రజలు ఇప్పటికీ నన్ను విశ్వసిస్తున్నారని ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను కచ్చితంగా తిరిగి వస్తాను. ఓం సాయిరాం" అని పృథ్వీ షా తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.
ఇక ఎస్ఎంఏటీ ఫైనల్ తర్వాత ముంబయి జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా పృథ్వీ షా విషయమై కీలక వ్యాఖ్యలు చేశాడు. "వ్యక్తిగతంగా అతను గాడ్ గిఫ్ట్ ప్లేయరని నేను భావిస్తున్నాను. ఒక ఆటగాడిగా అతను కలిగి ఉన్న ప్రతిభ ఎవరికీ లేదు. అతను తన పని తీరుని మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. పృథ్వీ అలా చేస్తే, అతనికి ఆకాశమే హద్దు. అతను చాలా క్రికెట్ ఆడాడు. అందరూ అతనికి ఇన్‌పుట్‌లు ఇచ్చారు. రోజు చివరిలో తన కోసం విషయాలను గుర్తించడం అతని పని. మొదట ఆటపై దృష్టిసారించడం అతని పని. మిగతా విషయాలు అవే సర్దుకుంటాయి" అని ఎస్ఎంఏటీ ఫైనల్‌లో మధ్యప్రదేశ్‌పై ముంబయి 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత అయ్యర్ అన్నాడు.