Australia vs India: వరుణుడి ఆటంకం.. 'డ్రా' గా ముగిసిన గబ్బా టెస్టు
- బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆసీస్ మూడో టెస్టు
- వర్షం అంతరాయంతో తేలని ఫలితం
- ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న గబ్బా టెస్టు 'డ్రా' గా ముగిసింది. 275 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన టీమిండియా టీ విరామ సమయానికి భారత్ 8-0తో నిలిచింది. ఆటకు వర్షం తీవ్ర అంతరాయం కలిగించడం వల్ల మ్యాచ్‌ను 'డ్రా' గా ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేసిన ఆతిథ్య జట్టు.. రెండో ఇన్నింగ్స్ లో 89/7 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో 185 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని టీమిండియాకు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక భారత జట్టు తన మొదటి ఇన్నింగ్స్ లో 260 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా, తొలి ఇన్నింగ్స్ లో భారీ సెంచరీ (152)తో అదరగొట్టిన ట్రావిస్ హెడ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
ఇక పెర్త్‌లో జరిగిన మొదటి టెస్టులో భారత్ గెలిస్తే, అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇప్పుడు బ్రిస్బేన్‌లో జరిగిన మూడో మ్యాచ్ డ్రా' గా ముగిసింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఇక భారత్, ఆసీస్ మధ్య నాలుగో టెస్టు ఈ నెల 26న ప్రారంభం కానుంది.