Milk: రోజూ ఉదయమే పాలు, ఖర్జూరాలు కలిపి తింటే ఏమవుతుంది?
- మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, ఇతర పోషకాలను ఇచ్చేవి పాలు
- రుచిగా ఉండి, శరీరానికి శక్తిని ఇచ్చేవి ఖర్జూరాలు
- ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయంటున్న ఆరోగ్య నిపుణులు
పాలు, ఖర్జూరాలు రెండూ కూడా మంచి పోషకాలు ఉన్నవే. మన శరీర ఆరోగ్యానికి తోడ్పడేవే. అయితే రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గోరువెచ్చని పాలలో రెండు ఖర్జూరాలను వేసుకుని కాసేపు నానబెట్టుకుని తీసుకుంటే... రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అని వివరిస్తున్నారు. మరి దీనితో ఉండే ప్రయోజనాలపై నిపుణులు ఏం చెబుతున్నారంటే...
రోజంతా ఉత్సాహం
రోజూ ఉదయమే గ్లాసు గోరువెచ్చని పాలలో రెండు, మూడు ఖర్జూరాలను నానబెట్టుకుని తింటే రోజంతా ఉత్సాహంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రెండింటిలోని ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు సమతుల శక్తిని ఇస్తాయని... ఖర్జూరాలలోని సహజ చక్కెరల వల్ల సమస్య తక్కువని పేర్కొంటున్నారు.
జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది
ఖర్జూరాలలో ఫైబర్ ఎక్కువ. ఒక్కో ఖర్జూరంలో ఒకటిన్నర గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థలో ఆహారం కదలికలను మెరుగుపరుస్తుంది. దీనికితోడు గోరువెచ్చని పాలు కూడా జీర్ణవ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేందుకు తోడ్పడుతాయి. మొత్తంగా రెండూ కలసి జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తాయి. మలబద్ధకాన్ని, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి.
హీమోగ్లోబిన్ పెరిగి... రక్త హీనత దూరం
గోరువెచ్చని పాలతో ఖర్జూరాలను పరగడుపున తీసుకుంటే... రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయులు పెరగడానికి తోడ్పడుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల శరీర కణాలకు ఆక్సిజన్ సరఫరా పెరిగి, జీవక్రియలు (మెటబాలిజం) ఊపందుకుంటాయని వివరిస్తున్నారు. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడుతున్నవారికి ఇవి మేలు అని సూచిస్తున్నారు.
ఎముకలు దృఢం
పాలలో, ఖర్జూరంలో రెండింటిలోనూ కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో ఎముకలు, దంతాలు బలంగా ఉండటానికి కాల్షియం తోడ్పడుతుంది. ఇక ఖర్జూరాలలో ఉండే మెగ్నీషియం కూడా కాల్షియంతో కలసి ఎముకలు దృఢంగా ఉండటానికి దోహదం చేస్తుంది. ఎముకల సంబంధింత సమస్యలు ఉన్నవారికి ఇవి మరింత ప్రయోజనకరమని నిపుణులు చెబుతున్నారు.
రోగ నిరోధక శక్తి బలోపేతం...
ఖర్జూరాలలో విటమిన్లతోపాటు ఐరన్, పొటాషియం, విటమిన్ బీ6 ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇక గోరువెచ్చని పాలలో ఉండే ఇమ్యూనో గ్లోబ్యులిన్ లు కూడా రోగ నిరోధక శక్తికి అండగా ఉంటాయి. అంటే రెండింటినీ కలిపి తీసుకుంటే మంచి ఇమ్యూనిటీకి తోడ్పడుతుందని నిపుణులు వివరిస్తున్నారు.
మంచి నిద్రకు తోడ్పాటు...
రాత్రిపూట గోరు వెచ్చని పాలలో రెండు ఖర్జూరాలు నానబెట్టుకుని తింటే... మంచి నిద్ర వస్తుందని నిపుణులు చెబుతున్నారు. పాలలోని ట్రిప్టోఫాన్ అనే రసాయన సమ్మేళనం నిద్రకు తోడ్పడే హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుందని... ఖర్జూరాలలోని మెగ్నీషియం నాడీ వ్యవస్థను నెమ్మదింపజేసి నిద్రకు తోడ్పడుతుందని వివరిస్తున్నారు.
రక్తపోటు తగ్గి... గుండె ఆరోగ్యం పెరిగి...
పాలు, ఖర్జూరాలలోని అత్యవసర కొవ్వులు, ఇతర పోషకాలు గుండె ఆరోగ్యానికి తోడ్పడుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఖర్జూరాలలోని పొటాషియం రక్తపోటును తగ్గిస్తుందని... అందులోని ఫైబర్ ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ ఉండేలా చూస్తుందని... మొత్తంగా గుండెపై ఒత్తిడి తగ్గుతుందని వివరిస్తున్నారు.
చర్మ సౌందర్యం...
ఖర్జూరాలలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సౌందర్యానికి తోడ్పడుతాయి. పాలలోని లాక్టిక్ యాసిడ్ శరీరంలో ద్రవాల స్థాయులు సరిగా ఉండేలా చూసి... చర్మం నిగనిగలాడేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
మెదడుకు ఆరోగ్యం కూడా...
పాలు, ఖర్జూరాలలోని సహజ చక్కెరలు, విటమిన్లు, ప్రొటీన్లు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని కలిపి తీసుకుంటే... జ్ఞాపకశక్తితోపాటు ఏకాగ్రత పెరుగుతుందని వివరిస్తున్నారు.