Ravichandran Ashwin: ధోనీ మాదిరిగానే చేశాడు.. ఇది సరికాదు.. అశ్విన్ రిటైర్‌మెంట్‌పై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ravichandran Ashwin retirement decision disrupt team planning says Sunil Gavaskar

  • సిరీస్ మధ్యలో వీడ్కోలు పలకడం సరికాదన్న క్రికెట్ దిగ్గజం
  • జట్టు ప్రణాళికలు దెబ్బతింటాయని వ్యాఖ్య
  • 2014-15లో ఎంఎస్ ధోనీ కూడా ఇదే రీతిలో వీడ్కోలు పలికాడన్న సునీల్ గవాస్కర్

భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అనూహ్య రీతిలో క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై దిగ్గజ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ విధంగా సిరీస్ మధ్యలో రిటైర్‌మెంట్ ప్రకటించడం జట్టుపై ప్రభావాన్ని చూపుతుందని ఆయన విశ్లేషించారు. 2014-15 ఆస్ట్రేలియా సిరీస్‌లో మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఇదే రీతిలో సిరీస్ మధ్యలో రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడని, ఈ విధంగా వ్యవహరిస్తే జట్టు ప్రణాళికలు దెబ్బతింటాయని
గవాస్కర్ అన్నారు. 

‘‘సిరీస్ ముగిసిన తర్వాత అశ్విన్ రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని ప్రకటించి ఉంటే బాగుండేది. జట్టు ఎంపికకు అందుబాటులో ఉండలేనని చెప్పవచ్చు. 2014-15 సిరీస్‌లో ఎంఎస్ ధోనీ 3వ టెస్ట్ మ్యాచ్ ముగిశాక రిటైర్‌మెంట్ ప్రకటించినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. ఒక ప్లేయర్ లేకుండానే జట్టు ప్రణాళికలు రూపొందించి ఆడాల్సి వచ్చింది’’ అని సునీల్ గవాస్కర్ గుర్తుచేశారు.

‘‘సెలక్షన్ కమిటీ ఒక లక్ష్యంతో ఆస్ట్రేలియా సిరీస్‌కు చాలా మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఎవరైనా గాయపడితే వారి స్థానంలో రిజర్వ్ ప్లేయర్లను ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నాలుగవ టెస్ట్ మ్యాచ్ జరగనున్న సిడ్నీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. 5వ మ్యాచ్ జరగనున్న మెల్‌బోర్న్‌ పిచ్ ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి, ఒక ఆటగాడు ఇలా మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించడం సరికాదు’’ అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు.

కాగా, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్‌ డ్రాగా ముగిసిన వెంటనే అశ్విన్ తన నిర్ణయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News