civils training: కార్పొరేట్‌కు దీటుగా ‘బీసీ’ సివిల్ సర్వీసెస్ కోచింగ్: మంత్రి సవిత

civils training as good as corporate says minister savitha

  • బీసీ స్టడీ సర్కిల్‌తో పాటు ఉచిత సివిల్ సర్వీసెస్ శిక్షణా కేంద్రం ప్రారంభించిన మంత్రి
  • తొలి విడతగా 110 మందికి శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడి 
  • త్వరలో అమరావతిలో శాశ్వత బీసీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణం చేస్తామన్న మంత్రి సవిత

కార్పొరేట్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లకు దీటుగా బీసీ యువతకు సివిల్ సర్వీసెస్ శిక్షణ ఇవ్వనున్నామని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. బుధవారం విజయవాడ గొల్లపూడిలో తాత్కాలిక బీసీ స్టడీ సర్కిల్ భవనంతో పాటు సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్‌ను ఎమ్మెల్యేలు వసంత వెంకట కృష్ణ ప్రసాద్, కొలికిపూడి శ్రీనివాస్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. 

తొలుత మహాత్మా జ్యోతి రావు పూలే విగ్రహానికి పూల మాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దివంగత ఎన్టీఆర్ బీసీల అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగించారని, అందుకే బీసీలు రాజ్యాధికారంలో భాగస్వాములయ్యారన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు బీసీలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. పాలనలో తమ లాంటి వారికి ప్రాధాన్యమిస్తూ, పదవులు ఇచ్చారని అన్నారు. 

యూపీఎస్‌సీ ఆధ్వర్యంలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో బీసీ యువత ఉత్తీర్ణత సాధించి, అత్యధిక మంది వెనుకబడిన తరగతి వారు ఐఏఎస్‌లు కావాలన్నది సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని మంత్రి సవిత తెలిపారు. దీనిలో భాగంగానే బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. 600 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించి, అర్హత పరీక్ష నిర్వహించగా 110 మంది సివిల్ సర్వీసెస్ కోచింగ్‌కు ఎంపికైనట్లు మంత్రి తెలిపారు. వారందరికీ రెసిడెన్షియల్ పద్ధతిలో భోజన, ఇతర వసతి సదుపాయాలు అందించనున్నామన్నారు.

వచ్చే శిక్షణ నాటికి రాజధాని అమరావతి ప్రాంతంలో 5 ఎకరాల విస్తీర్ణంలో బీసీ స్టడీ సర్కిల్ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. 500 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేలా ఈ భవన నిర్మాణం చేపట్టనున్నామని, రెండేళ్లలో ఈ భవనాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. దేశంలోనే ప్రముఖ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లా ఎక్స్‌లెన్స్ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో నిష్ణాతులైన అధ్యాపకులతో బీసీ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. 

ఈ కార్యక్రమంలో పలు బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు వీరంకి వెంకట గురుమూర్తి, దేవేంద్రప్ప, రుద్రకోట సదాశివం, చిలకలపూడి పాపారావు, నందం అబద్ధయ్య, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్, డైరెక్టర్ మల్లికార్జున, బీసీ సంఘ నాయకులు కేశన శంకరరావు, సివిల్ సర్వీసెస్ శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
.

  • Loading...

More Telugu News