Hari Rama Jogaiah: మంత్రి నిమ్మల రామానాయుడుకి హరిరామ జోగయ్య లేఖ
- పాలకొల్లులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలన్న జోగయ్య
- రాజ్య భవనాలు, పాలన భవనాల నిర్మాణం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని విమర్శ
- ప్రభుత్వ ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయని వ్యాఖ్య
పాలకొల్లు నియోజకవర్గంలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని కోరుతూ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ శ్రీనివాస్ వర్మకు మాజీ మంత్రి, కాపు నేత హరిరామ జోగయ్య లేఖ రాశారు. అభివృద్ధి అంటే పరిపాలన భవనాలు, నివాస భవనాలు, పార్కులు, విశ్రాంతి భవనాలు నిర్మించడానికి ప్రాధాన్యత ఇవ్వడం కాదని... స్వచ్ఛమైన తాగునీరు, విద్య, వైద్యం, ఆరోగ్యం, రోడ్ల నిర్మాణం, సాగు నీరు, మురుగు కాలువల నిర్మాణం కూడా అతి ముఖ్యమైనవని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయని విమర్శించారు.
రాజ్య భవనాలు, నివాస, పరిపాలన భవనాల నిర్మాణాల పేరుతో కోట్ల రూపాయలను ఖర్చు చేయడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని జోగయ్య విమర్శించారు. ఇది నిజమైన అభివృద్ధి అనిపించుకోదని చెప్పారు. నరసాపురం, భీమవరం, రాజోలు నియోజకవర్గాలకు సమదూరంలో ఉన్న పాలకొల్లు నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఎవరికైనా పెద్ద వైద్య అవసరం వస్తే హైదరాబాద్ కు కానీ, వైజాగ్ కు కానీ వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఆరోగ్యశ్రీ సదుపాయం కలిగిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అవసరం ఉందని తెలిపారు. దీనికి ప్రాధాన్యతను ఇవ్వాలని కోరారు.