Charlapalli Railway Terminal: ఈ నెల 28న చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం

Charlapalli Railway Terminal will be inaugurated on Dec 28
  • రూ.430 కోట్లలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మాణం
  • ప్రారంభించనున్న కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి 
  • అత్యాధునిక సౌకర్యాలతో నిర్మితమైన రైల్వే టెర్మినల్
పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సికింద్రాబాద్ కు సమీపంలోని చర్లపల్లి వద్ద నిర్మించిన భారీ రైల్వే టెర్మినల్ మరికొన్ని రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ డిసెంబరు 28న ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈ రైల్వే టెర్మినల్ ను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర గనులు, బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు.

స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ శైలిలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను రూ.430 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నిర్మించారు. ఇందులో 9 ప్లాట్ ఫాంలు, 6 ఎస్కలేటర్లు, 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, రిజర్వేషన్ కౌంటర్లు, రెగ్యులర్ టికెట్ కౌంటర్లు ఉన్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, ఏసీ, నాన్-ఏసీ వెయిటింగ్ లాంజ్ లు కూడా ఉన్నాయి. ప్రయాణికులు ఈ స్టేషన్ లో ఉచితంగా వై-ఫై పొందవచ్చు. 

చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి 25 రైళ్లు (25 అప్, 25 డౌన్) రాకపోకలు సాగించనున్నాయి. ప్రధానంగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై ఒత్తిడి తగ్గించాలన్న ఉద్దేశంతోనే చర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మించారు. ఇక్కడ్నించి నిత్యం 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని అంచనా.
Charlapalli Railway Terminal
Inauguration
Hyderabad
Secunderabad
Telangana

More Telugu News