Patnam Narendar Reddy: లగచర్ల కేసు: జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
- లగచర్లలో ప్రభుత్వాధికారులపై దాడి కేసు
- మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు రైతుల అరెస్ట్
- బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి స్పెషల్ కోర్టు
కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో ప్రభుత్వ అధికారులపై దాడి కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
గత నెలలో, ప్రజాభిప్రాయసేకరణ కోసం లగచర్ల గ్రామానికి వెళ్లిన జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై రైతులు తిరగబడడం తెలిసిందే. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. పోలీసులు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు పలువురు రైతులను కూడా అరెస్ట్ చేశారు. వీరికి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అయితే, నాంపల్లి స్పెషల్ కోర్టు పట్నం నరేందర్ రెడ్డితో పాటు రైతులకు బెయిల్ మంజూరు చేయడంతో, నేడు విడుదలయ్యారు.
అనంతరం పట్నం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ కుట్రలో భాగంగానే తనపై కేసు పెట్టారని మండిపడ్డారు. దీని వెనుక రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కుట్ర ఉందని ఆరోపించారు.