Gold: ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న బంగారంలో భార‌తీయ మ‌హిళ‌ల వ‌ద్ద‌ ఎంత ఉందో తెలిస్తే షాక‌వ్వాల్సిందే..!

Indian Women Hold 11 Percent of the Worlds Gold Says Report

  • ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న బంగారంలో భార‌తీయ మ‌హిళ‌ల వ‌ద్దే 11 శాతం
  • ఇది సుమారు 24వేల ట‌న్నుల‌కు స‌మానం అన్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ 
  • ఇది యూఎస్, జ‌ర్మ‌నీ, ఇటలీ, ఫ్రాన్స్‌, ర‌ష్యాల సంయుక్త నిల్వ‌ల కంటే అధికం
  • అందులోనూ దక్షిణ భారతదేశంలోని మహిళల వ‌ద్దే అధిక ప‌సిడి నిల్వ‌లు

బంగారం భారతదేశంలో చాలా కాలంగా సంపద, సంప్రదాయం, సాంస్కృతిక ప్రాముఖ్యతకు చిహ్నంగా ఉంది. . ఇది భారతీయ వేడుకలలో ముఖ్యంగా వివాహాలలో అగ్ర‌ స్థానాన్ని కలిగి ఉంది. బంగారం బహుమతి లేకుండా ఏ భారతీయ వివాహమూ పూర్తి కాదు. ఇక బంగారం అంటే మ‌హిళ‌ల‌కు ఎంతో ప్రీతి. ముఖ్యంగా భార‌తీయ మ‌హిళ‌లు ప‌సిడి కొన‌డంలో ముందుంటారు. అదే ఇప్పుడు భార‌తీయ మ‌హిళ‌ల‌ను బంగారం నిల్వ‌ల విష‌యంలో అగ్రస్థానంలో నిలిపింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం భారతీయ మహిళలు దాదాపు 24,000 టన్నుల బంగారాన్ని కలిగి ఉన్నారు. ఇది ప్రపంచంలోని మొత్తం బంగారు నిల్వలలో 11 శాతానికి స‌మానం అని గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది.

భారతీయ మహిళల వద్ద ఉన్న మొత్తం ప‌సిడి మొదటి ఐదు దేశాల సంయుక్త బంగారు నిల్వల కంటే అధికంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. అమెరికా (8,000 టన్నులు), జర్మనీ (3,300 టన్నులు), ఇటలీ (2,450 టన్నులు), ఫ్రాన్స్ (2,400 టన్నులు), రష్యా 1,900 టన్నులు) ప‌సిడి నిల్వ‌ల‌ను కలిగి ఉన్నాయి. అలాగే ఆక్స్‌ఫర్డ్ గోల్డ్ గ్రూప్ నివేదిక ప్రకారం భారతీయ కుటుంబాలు ప్రపంచంలోని మొత్తం బంగారంలో 11 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇది అమెరికా, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌), స్విట్జర్లాండ్, జర్మనీల సంయుక్త నిల్వల కంటే ఎక్కువ.

ఇక భారతదేశంలోని మొత్తం బంగారంలో 40 శాతం వ‌ర‌కు దక్షిణ ప్రాంతంలోని మహిళల వ‌ద్ద ఉన్న‌ట్లు తెలుస్తోంది. అందులోనూ తమిళనాడు వ‌ద్దే 28 శాతం ప‌సిడి ఉంది. కాగా, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ 2020-21 నివేదిక ప్ర‌కారం భారతీయ కుటుంబాలు 21,000 నుంచి 23,000 టన్నుల బంగారం కలిగి ఉన్నాయని పేర్కొంది. 2023 నాటికి ఈ సంఖ్య సుమారుగా 24,000 నుంచి 25,000 టన్నులకు చేరింది. ఇది భారతదేశ జీడీపీలో 40 శాతం వాటాను కవర్ చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు చేయూత‌ ఇవ్వడంలో కీల‌క‌ పాత్ర పోషిస్తుంది.

ఇక భారతదేశంలోని ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం వివాహిత మహిళలు 500 గ్రాముల వరకు బంగారం కలిగి ఉండొచ్చు. అలాగే అవివాహిత మహిళలు 250 గ్రాముల వ‌ర‌కు, పురుషులు 100 గ్రాముల వరకు మాత్రమే బంగారాన్ని కలిగి ఉండ‌టానికి అనుమ‌తి ఉన్న విష‌యం తెలిసిందే. 

  • Loading...

More Telugu News