Komatireddy Venkat Reddy: పుష్ప-2 సినిమాతో ఆఖరు... అవన్నీ ఆపేస్తున్నాం: మంత్రి కోమటిరెడ్డి
- కిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన మంత్రి కోమటిరెడ్డి
- చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ కు పరామర్శ
- అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి
- ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని వెల్లడి
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలైన బాలుడు శ్రీతేజ్ ను తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సాయంత్రం పరామర్శించారు. అనంతరం ఆయన ఆసుపత్రి వెలుపల మీడియాతో మాట్లాడారు. పుష్ప-2 ప్రీమియర్ షో చూసేందుకు రేవతి అనే మహిళ తన భర్త, కుమారుడితో శ్రీతేజ్ థియేటర్ వద్దకు వచ్చారని, అదే సమయంలో అల్లు అర్జున్ రావడంతో ఆయనను చూసేందుకు జనం ఎగబడ్డారని కోమటిరెడ్డి వెల్లడించారు.
ఈ తొక్కిసలాటలో రేవతి, అమె కుమారుడు కిందపడిపోయారని... రేవతి మృతి చెందగా, శ్రీతేజ్ బాగా దెబ్బలు తగిలాయని వివరించారు. ఇంత జరిగినా హీరో గానీ, నిర్మాత గానీ ఏమీ పట్టించుకోకుండా వెళ్లి థియేటర్ బాల్కనీలో కూర్చుని సినిమా చూశారని కోమటిరెడ్డి ఆరోపించారు.
థియేటర్ బయట పరిస్థితి ఏమీ బాగా లేదు సార్... మీరు వెళ్లిపోండి అని ఏసీపీ చెప్పినా వినిపించుకోకపోవడంతో, డీసీపీ వెళ్లి గట్టిగా మందలింపు ధోరణితో చెప్పాల్సి వచ్చిందని అన్నారు. అయినప్పటికీ, సినిమా అయిపోయే దాకా చూసి, మళ్లీ వాహనం రూఫ్ టాప్ నుంచి చెయ్యి ఊపుకుంటూ వెళ్లారని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.
"అక్కడ రేవతి, ఆమె బిడ్డ పరిస్థితి గురించి సినిమా వాళ్లు ఎవరూ పట్టించుకోలేదు. సినిమా చూడ్డానికి వచ్చిన వాళ్లు స్పందించడంతో, ఆమెను, ఆమె కొడుకును ఆసుపత్రికి తరలించారు. రేవతి చనిపోయింది. ఆమె కొడుకు చికిత్స పొందుతున్నాడు. ఇవాళ ఆ బిడ్డను చూసేందుకు ఆసుపత్రికి వచ్చాను. డాక్టర్లతోనూ, ఆసుపత్రి యాజమాన్యంతోనూ మాట్లాడాను.
వెంటిలేటర్ తీసేసి, గొంతు వద్ద రంధ్రం చేసి శ్వాస అందిస్తున్నారు. పైపుల ద్వారా ఆహారం అందిస్తున్నారు... అబ్బాయి చాలా బలహీనంగా ఉన్నాడు. మృతి చెందిన రేవతికి ఆత్మశాంతి కలగాలని, ఆమె కుమారుడు త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను.
ఆ రోజున పోలీసుల అనుమతి లేకుండానే చిత్రబృందం థియేటర్ వద్దకు వచ్చింది. హీరో కాన్వాయ్ తో పాటు అనేకమంది బౌన్సర్లు థియేటర్ వద్దకు వచ్చారు. ప్రేక్షకులను బౌన్సర్లు నెట్టివేశారు. ఇక మీదట సినిమాల ప్రీమియర్ షోలకు అనుమతిచ్చే విషయంపై సమీక్ష చేపడతాం. ఎంత బడ్జెట్ పెట్టి సినిమా తీసినా, టికెట్ల రేట్లు పెంచుకోవడంపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటాం.
దేశ స్వాతంత్ర్యానికి సంబంధించిందా? లేక, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిందా? లేకపోతే, డ్రగ్స్ మీద, ఇతర సమస్యల మీద ప్రజలకు సందేశం ఇచ్చే సినిమానా? అనే విషయాలు ఆలోచించి, అది కూడా నామమాత్రంగానే టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తాం. బెనిఫిట్ షోలకు అనుమతించే ప్రశ్నే లేదు. ఇలాంటివన్నీ పుష్ప-2తోనే ఆపేస్తున్నాం. పుష్ప-2 చిత్రం బాగుంటే అందరూ చూడండి... నేను కూడా చూశాను.
ఇకపై దేవుళ్ల సినిమాలు, చరిత్రకు సంబంధించిన సినిమాలు, రాజుల సినిమాలు, తెలంగాణ ఉద్యమ సినిమాలు తప్ప ఇతర తెలుగు సినిమాలు చూడదలచుకోలేదు. ఎందుకంటే... మూడున్నర గంటలు ఉండే సినిమా చూసే బదులు చాలా పనులు చేసుకోవచ్చు. ఆ సినిమా చూసిన తర్వాత మన యువకులు కూడా చెడిపోతారు" అని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.