Crime News: బైకర్‌ను ఢీకొట్టి 30 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన డిప్యూటీ తహసీల్దార్ కారు
- ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలో ఘటన
- కారు అదుపుతప్పి బైకర్‌ను ఢీకొట్టిన వైనం
- తప్పించుకునే క్రమంలో అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయిన కారు
- అప్పటికే కారు కింద చిక్కుకున్న బైకర్ నరేంద్రకుమార్ దుర్మరణం
- డ్రైవర్ అరెస్ట్.. తహసీల్దార్ సస్పెన్షన్‌కు కలెక్టర్ సిఫార్సు
డిప్యూటీ తహసీల్దార్ ప్రయాణిస్తున్న వాహనం బైకర్‌ను ఢీకొట్టి 30 కిలోమీటర్లు ఈడ్చుకుపోయింది. ఈ ఘటనలో బైకర్ దుర్మరణం పాలయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలో గురువారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పయాగ్‌పూర్ గ్రామానికి చెందిన నరేంద్రకుమార్ హల్దార్ (35) బైక్‌పై ఇంటికి వస్తుండగా నాన్‌పారా-బహ్రాయిచ్ రహదారిపై డిప్యూటీ తహసీల్దార్ శైలేశ్ అవస్థి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి అతడిని ఢీకొట్టింది. దీంతో నరేంద్ర కారు కింద చిక్కుకుపోయాడు.
నరేంద్ర కారు కింద చిక్కుకుపోయిన విషయాన్ని గమనించని కారు డ్రైవర్ మేరజ్ అహ్మద్ అలాగే నడుపుకొంటూ 30 కిలోమీటర్లు ప్రయాణించి వాహనాన్ని నాన్‌పరా తహసీల్దార్ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి ఆపాడు. అప్పటికే నరేంద్రకుమార్ ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రమాదం జరిగిన విషయం వారికి తెలిసే ఉంటుందని, ఘటనా స్థలం నుంచి తప్పించుకునేందుకు వారు అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తహసీల్దార్‌ను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ మోనికా రాణి సిఫార్సు చేశారు.