Child Trafficking: తండ్రి అప్పు తీర్చేందుకు ఏడేళ్ల కూతురు అమ్మకం.. గుజరాత్ లో దారుణం

Seven year old girl sold for Rs 3 lakh to recover fathers debt
  • బాలికను కిడ్నాప్ చేసి 3 లక్షలకు అమ్మేసిన వడ్డీ వ్యాపారులు
  • తల్లిదండ్రుల ఫిర్యాదుతో వేగంగా స్పందించిన పోలీసులు
  • ముగ్గురు రుణదాతలను అరెస్టు చేసి బాలికను కాపాడినట్లు వెల్లడి
గుజరాత్ లో దారుణం చోటుచేసుకుంది.. తండ్రి అప్పు తీర్చడంలేదని ఏడేళ్ల కూతురిని కిడ్నాప్ చేసిన వడ్డీ వ్యాపారులు, ఆ బాలికను రాజస్థాన్ కు చెందిన వ్యక్తికి అమ్మేశారు. ఈ దారుణంపై బాధిత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా.. వేగంగా స్పందించిన పోలీసులు వడ్డీ వ్యాపారులను, రాజస్థానీ వ్యక్తిని అరెస్టు చేసి బాలికను కాపాడారు. బాధిత కుటుంబం, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సబరకాంత జిల్లాకు చెందిన ఓ రోజు కూలీ స్థానిక వడ్డీ వ్యాపారి అర్జున్ నాథ్ వద్ద అధిక వడ్డీకి రూ.60 వేలు అప్పు తీసుకున్నాడు.

క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తున్నప్పటికీ అర్జున్ నాథ్ వేధింపులకు గురిచేశాడని, అసలు రూ.3 లక్షలకు పెరిగిందని చెప్పి మొత్తం తిరిగివ్వాలని డిమాండ్ చేశాడని చెప్పారు. మరో ఇద్దరు వడ్డీ వ్యాపారులు షరీఫా నాథ్, లఖ్ పతి నాథ్ లతో కలిసి ఇటీవల తనపై దాడి చేశాడని చెప్పారు. తనను తీవ్రంగా కొట్టి ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. ఆపై ఏడేళ్ల తన కూతురును కిడ్నాప్ చేసి రూ.3 లక్షలకు అమ్మేసినట్లు చెప్పారు. 

రాజస్థాన్ లోని అజ్మీర్ సమీపంలో ఉన్న ఓ గ్రామస్థుడికి తన కూతురును అమ్మేసినట్లు తెలిసిందన్నారు. దీనిపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించి వడ్డీ వ్యాపారులు ముగ్గురినీ అరెస్టు చేశామని పోలీసులు వివరించారు. వారి ద్వారా రాబట్టిన వివరాల ఆధారంగా రాజస్థాన్ వెళ్లి బాలికను కాపాడి తీసుకొచ్చామని తెలిపారు. నిందితులు ముగ్గురినీ కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదైన గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేసి బాలికను కాపాడినట్లు పేర్కొన్నారు.
Child Trafficking
Gujarat
Money Lenders
Girl Sold

More Telugu News