Attack On Allu Arjun House: మా ఇంటి ముందు ఘటన అందరూ చూశారు: అల్లు అరవింద్
- అల్లు అర్జున్ నివాసంపై ఓయూ జేఏసీ విద్యార్థి నేతల దాడి
- ఇలాంటి ఘటన ఎవరికీ జరగకూడదన్న అల్లు అరవింద్
- ఇప్పుడు తాము రియాక్ట్ అవకూడని సమయం అని వెల్లడి
తన కుమారుడు అల్లు అర్జున్ నివాసాన్ని ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు ముట్టడించిన ఘటనపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. మా ఇంటి ముందు జరిగిన ఘటనను అందరూ చూశారు... ఇలాంటి ఘటన ఎవరికీ జరగకూడదు అని వ్యాఖ్యానించారు. తొందరపడి ఎవరూ అలాంటి చర్యలకు పాల్పడవద్దు... ఇటువంటి పరిస్థితుల్లో అందరూ సంయమనం పాటించాలి... అదే మంచిది అని అన్నారు.
తమ ఇంటికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారని, దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్నారని అల్లు అరవింద్ వెల్లడించారు. ఎవరూ కూడా ఇలాంటి దుశ్చర్యలను ప్రేరేపించవద్దు... దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని హితవు పలికారు. పరిస్థితుల దృష్ట్యా... ఇప్పుడు తాము రియాక్ట్ అవకూడని సమయం ఇది అని వ్యాఖ్యానించారు.
కాగా, విద్యార్థి జేఏసీ నేతలు అల్లు అర్జున్ నివాసంలోకి ప్రవేశించి పూలకుండీలు ధ్వంసం చేయడమే కాకుండా, అక్కడి సిబ్బందిపైనా దాడి చేసినట్టు పలు చానళ్లలో విజువల్స్ ప్రసారమవుతున్నాయి.