Jagapatibabu: శ్రీతేజ్ ను పరామర్శించాలనిపించింది... షూటింగ్ అవగానే వెళ్లాను: జగపతిబాబు
- సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్
- గత కొన్ని వారాలుగా ఆసుపత్రిలో చికిత్స
- మానవతా దృక్పథంతో ఆసుపత్రికి వెళ్లానన్న జగపతిబాబు
జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ ను పరామర్శించడానికి సినీ ప్రముఖులు పోటెత్తారని, కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను ఒక్కరూ పరామర్శించలేదంటూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు జగపతిబాబు ఇవాళ ఓ వీడియో విడుదల చేశారు. ఒక క్లారిటీ కోసం ఈ ట్వీట్ చేస్తున్నానని తెలిపారు.
బాలుడు శ్రీతేజ్ ను, అతడి కుటుంబాన్ని పరామర్శించాలనిపించిందని, షూటింగ్ ముగిసిన వెంటనే ఆసుపత్రికి వెళ్లి కలిశానని వెల్లడించారు. తనకు పబ్లిసిటీ చేసుకోవడం ఇష్టం ఉండదని, అందుకే ఈ విషయం ఇప్పటిదాకా ఎవరికీ చెప్పలేదని, కానీ క్లారిటీ ఇవ్వడం కోసం ఇప్పుడు చెప్పాల్సి వస్తోందని స్పష్టం చేశారు.
ఈ దురదృష్టకర ఘటనలో బాధితులైన శ్రీతేజ్ ను, అతడి తండ్రిని, సోదరిని చూడాలనిపించిందని, పలకరించాలనిపించిందని జగపతిబాబు వెల్లడించారు. మానవతాదృక్పథంతో ఆసుపత్రికి వెళ్లానని, అక్కడి పరిస్థితి చూశాక పాజిటివ్ గా అనిపించిందని, కోలుకునేందుకు అవకాశాలున్నాయనిపించిందని అన్నారు. త్వరగా ఆరోగ్యవంతుడవ్వాలని కోరుకుంటున్నానని జగపతిబాబు తెలిపారు.