Giant Python: పంట పొలంలో 19 అడుగుల కొండచిలువ!
- ఒడిశాలోని కేంద్రపడ జిల్లాలో కనిపించిన భారీ కొండచిలువ
- వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించిన స్థానికులు
- కొండచిలువను చాకచక్యంగా బోనులో బంధించిన అటవీశాఖ సిబ్బంది
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 19 అడుగుల భారీ కొండచిలువను అటవీశాఖ అధికారులు పట్టుకున్న ఘటన ఒడిశా రాష్ట్రంలో వెలుగు చూసింది. ఓ పంట పొలంలో ఈ భారీ కొండచిలువను స్థానికులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని కేంద్రపడ జిల్లా రాజేంద్ర నారాయణపూర్ గ్రామం శివారులోని పంట పొలంలో శనివారం నాడు ఈ కొండచిలువను గుర్తించిన గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు.
వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో అక్కడికి వచ్చిన అధికారులు, సిబ్బంది కొండచిలువను చాకచక్యంగా బోనులో బంధించారు. అయితే, కొండచిలువను బోనులో బంధించే క్రమంలో దానికి స్వల్ప గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. దాంతో చికిత్స అనంతరం కొండచిలువను అడవిలో విడిచిపెట్టనున్నట్లు అధికారులు చెప్పారు.