Pushpa 2: పుష్ప-2 కలెక్షన్ల సునామీ.. దేశీయంగా బహుబలి-2 రికార్డు బద్దలు!

Pushpa 2 has officially surpassed the seven year record held by Baahubali 2

  • ఆదివారం దేశవ్యాప్తంగా రూ.33.25 కోట్లు కొల్లగొట్టిన పుష్ప-2
  • దేశవ్యాప్తంగా రూ.1,062 కోట్లకు చేరిన వసూళ్లు
  • బాహుబలి-2 సాధించిన రూ.1,040 కోట్లను అధిగమించిన పుష్పరాజ్
  • ప్రపంచవ్యాప్తంగా రూ.1,600 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన పుష్ప-2

అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో, దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప-2 కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతోంది. ముఖ్యంగా హిందీ వెర్షన్‌లో ఈ సినిమా అప్రతిహతంగా దూసుకెళుతూ బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొడుతోంది. విడుదలైన 18వ రోజైన ఆదివారం (డిసెంబర్ 22) ఈ సినిమా అంచనాలను మించి రూ.33.25 కోట్లు కొల్లగొట్టింది. 

దీంతో మూడవ వారం వీకెండ్‌లో ఏకంగా రూ.72.3 కోట్లు రాబట్టిందని, ఈ కలెక్షన్లను అనేక చిత్రాలు ఓపెనింగ్స్ రూపంలో కూడా రాబట్టలేకపోయాయని మూవీ కలెక్షన్లు ట్రాక్ చేసే ‘శాక్‌నిల్క్’ పేర్కొంది. ఆదివారం రూ. 33.25 కోట్లు, శనివారం రూ.24.75 కోట్లు, శుక్రవారం రూ.14.3 కోట్లు వసూలు చేసిందని తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా చూసుకుంటే.. పుష్ప-2 వసూళ్లు రూ.1,062.9 కోట్లకు చేరాయని పేర్కొంది. కాగా, 2017 నుంచి ఏడేళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న బాహుబలి-2 రూ.1,040 కోట్లు వసూళ్లను పుష్ప-2 అధికారికంగా అధిగమించినట్టేనని సినీ ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

రూ.1,600 కోట్ల క్లబ్‌లో అడుగు
ఇక, ఆదివారం వసూళ్లతో కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 కలెక్షన్లు రూ.1600 కోట్లు దాటాయి. దీంతో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడవ భారతీయ చిత్రంగా ఇది నిలిచింది. మొదటి స్థానంలో దంగల్ (రూ.2 వేల కోట్లు పైగా), రెండో  స్థానంలో బాహుబలి-2 (రూ.1,790 కోట్లు) వుండగా ఆ తర్వాతి స్థానంలో పుష్ప-2 నిలిచింది. క్రిస్మస్ నుంచి న్యూఇయర్ వరకు హాలిడే సీజన్ కావడంతో మరింత దూసుకెళ్లే అవకాశం కూడా ఉందని సినీ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 

ముఖ్యంగా హిందీ వెర్షన్‌లో పుష్ప-2 అదరగొడుతోంది. వసూళ్లు చక్కగా కొనసాగుతుండడంతో ఉత్తరాది రాష్ట్రాలలో హిందీ సినిమాల విడుదలపై కూడా ప్రభావం చూపేలా ఉంది. థియేటర్ యజమానులు పుష్ప-2ను తీసేసి కొత్త సినిమాల విడుదలకు అంగీకరిస్తారో లేదో అనే చర్చ కూడా నడుస్తోంది.

  • Loading...

More Telugu News