Chiranjeevi: దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనగల్ మృతిపై చిరంజీవి స్పందన
- దేశంలోనే అత్యుత్తమ దర్శకులు, గొప్ప మేధావుల్లో శ్యామ్ బెనగల్ ఒకరన్న మెగాస్టార్
- ఆయన సినిమాలు, జీవిత చరిత్రలు, డాక్యుమెంటరీలు భారత గొప్ప సాంస్కృతిక సంపదలో భాగమని నివాళులు
- ఆయన సినిమాలు భారతీయ చలనచిత్ర రంగంలో ఎల్లప్పుడూ గౌరవాన్ని పొందుతాయన్న చిరంజీవి
దిగ్గజ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ నిన్న సాయంత్రం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై యావత్ సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేశారు.
ఇదే క్రమంలో శ్యామ్ బెనగల్ మృతిపై ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దేశంలోనే అత్యుత్తమ దర్శకులు, గొప్ప మేధావుల్లో బెనగల్ ఒకరని చిరంజీవి పేర్కొన్నారు. చలనచిత్ర రంగంలో వెలుగొందిన కొంతమంది ప్రముఖుల్లో ప్రతిభను గుర్తించి ఆయన కళాకారులను ప్రోత్సహించారని తెలిపారు.
ఆయన సినిమాలు, జీవిత చరిత్రలు, డాక్యుమెంటరీలు భారత గొప్ప సాంస్కృతిక సంపదలో భాగమని అన్నారు. తోటి హైదరాబాదీ, రాజ్యసభ మాజీ సభ్యుడైన బెనగల్ అద్భుతమైన సినిమాలు తీశారని, అవి భారతీయ చలనచిత్ర రంగంలో ఎల్లప్పుడూ గౌరవాన్ని పొందుతాయని చిరంజీవి పేర్కొన్నారు.