Delhi High Court: అత్యాచార బాధితులకు ఏ హాస్పిటలైనా ఉచితంగా చికిత్స అందించాల్సిందే: ఢిల్లీ హైకోర్టు

Delhi High Court said hospitals cannot refuse medical treatment to survivors of rape
  • అత్యాచారంతో పాటు యాసిడ్ దాడి, లైంగిక వేధింపుల బాధితులకు కూడా వర్తింపు
  • ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌హోమ్‌లకు స్పష్టం చేసిన ఢిల్లీ హైకోర్ట్
  • మెడికల్ పరీక్షలు కూడా ఉచితంగా చేయాలంటూ న్యాయస్థానం ఆదేశాలు
  • ఉచిత చికిత్స నిరాకరించడం నేరమని హెచ్చరిక
అత్యాచారం, యాసిడ్ దాడి, లైంగిక వేధింపుల బాధితులకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌హోమ్‌లు ఉచిత వైద్య చికిత్సను నిరాకరించడానికి వీల్లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఉచిత వైద్యంలో భాగంగా మెడికల్ పరీక్షలు కూడా డబ్బులు తీసుకోకుండా చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

లైంగిక దాడుల బాధితులకు చికిత్స నిరాకరించడం చట్ట రీత్యా నేరమని, సంబంధిత హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, మేనేజ్‌మెంట్ జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. 16 ఏళ్ల బాలికపై ఆమె తండ్రి అత్యాచారం చేసిన కేసులో ఢిల్లీ హైకోర్ట్ జడ్జిలు ప్రతిభా ఎం సింగ్, అమిత్ శర్మలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

లైంగిక దాడుల నుంచి బయటపడిన బాధితులు ఉచిత వైద్య చికిత్స విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది. ఉచిత చికిత్సలో భాగంగా అవసరమైన అన్ని పరీక్షలు, రోగ నిర్ధారణ టెస్టులు చేయడంతో పాటు దీర్ఘకాలిక వైద్య సంరక్షణ కూడా అందించాలని స్పష్టం చేసింది. బాధితులకు అవసరమైన కౌన్సెలింగ్ కూడా ఇవ్వాలని ఢిల్లీ హైకోర్ట్ తెలిపింది.
Delhi High Court
New Delhi
Crime News

More Telugu News