Sukumar: సినిమాలు చేయడం మానేస్తానంటూ సుక్కు షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్!
- అమెరికాలో 'గేమ్ చేంజర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆసక్తికర పరిణామం
- సుక్కును 'దోప్' అనే పదంతో ఒకటి వదిలేయాలంటే మీరు ఏం వదిలేస్తారని ప్రశ్న
- దానికి తాను సినిమాలు మానేస్తాని దర్శకుడి రిప్లై
- ఇది జరిగేది కాదంటూ కవర్ చేసిన రామ్‌చరణ్
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తాను సినిమాలు చేయడం మానేస్తానంటూ చేసిన షాకింగ్ కామెంట్స్ తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. గత ఆదివారం నాడు 'గేమ్ చేంజర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని డల్లాస్ లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌కు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ వేడుకలో యాంకర్ సుమ... లెక్కల మాస్టారు సుక్కును 'దోప్' అనే పదంతో ఒకటి వదిలేయాలంటే మీరు ఏం వదిలేస్తారు? అని ప్రశ్నించారు. దీనికి ఆయన "సినిమాలు చేయడం మానేస్తాను" అని సమాధానం ఇచ్చారు. దాంతో సుకుమార్ పక్కనే కూర్చున్న హీరో రామ్‌చరణ్ ఆయన వద్ద నుంచి మైక్ తీసుకుని... "లేదండి.. ఈయన గత కొన్నేళ్లుగా ఇలాగే అందరినీ భయపెడుతున్నారు. అది జరిగేది కాదు" అంటూ కవర్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
ఇక గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కిన 'గేమ్ చేంజర్' మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. చెర్రీ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్ బాణీలు అందిస్తున్న ఈ మూవీని... శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించారు. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.