Kur Kure: 'కుర్ కురే' చిచ్చు... కొట్టుకున్న రెండు కుటుంబాలు... 10 మందికి తీవ్ర గాయాలు
- కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఘటన
- కాలం చెల్లిన కుర్ కురే అమ్మడంతో గొడవ
- అరెస్ట్ భయంతో పరారీలో 25 మంది
20 రూపాయల కుర్ కురే ప్యాకెట్ రెండు కుటుంబాల మధ్య గొడవ పెట్టింది. రెండు కుటుంబాలు పరస్పరం దాడి చేసుకోవడంతో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. ఈ ఘటన కర్ణాటకలోని దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకా హొన్నబాగా గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... అతీఫుల్లా అనే వ్యక్తికి చెందిన కిరాణా షాపులో సద్దాం అనే వ్యక్తి పిల్లలు ఒక కుర్ కురే ప్యాకెట్ కొన్నారు. అయితే ఎక్స్ పైరీ అయిన కుర్ కురేను అమ్మారంటూ సద్దాం కుటుంబీకులు వచ్చి ప్రశ్నించారు. దీంతో అతీఫుల్లా, సద్దాం కుటుంబాల మధ్య గొడవ ప్రారంభమయింది. ఇరు కుటుంబాలకు చెందిన వ్యక్తులు దారుణంగా కొట్టుకున్నారు. ఆ తర్వాత అతీఫుల్లా మనుషులు మరో రెండు వాహనాల్లో వచ్చి సద్దాం హోటల్ లో ఉన్న వస్తువులను చెల్లాచెదురుగా పడేశారు. ఈ గొడవలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అనంతరం రెండు కుటుంబాలు చన్నగిరి పోలీస్ స్టేషన్ లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలో అరెస్ట్ భయంతో సుమారు 25 మంది పరారయ్యారు. మరోవైపు 20 రూపాయల కుర్ కురే ఇంత పని చేసిందా? అని స్థానికులు ఆశ్యర్యపోతున్నారు.