ACB: ఏపీ ఐపీఎస్ అధికారి సంజయ్ పై ఏసీబీ కేసు
- అగ్నిమాపక శాఖ డీజీగా పని చేసిన కాలంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని సంజయ్‌పై అభియోగం
- సంజయ్‌పై ఏసీబీ విచారణకు ఆమోదం తెలిపిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
- పనులు జరగకపోయినా కాంట్రాక్ట్ సంస్థలకు నిధుల చెల్లింపులు
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ సీఐడీ మాజీ చీఫ్ ఎన్ సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదైంది. గత ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ డీజీగా సంజయ్ పని చేసిన సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. దీనిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏసీబీ అధికారులు లేఖ రాశారు. సీఎస్ అనుమతి లభించడంతో సంజయ్‌పై కేసు నమోదైంది. ఏ 1గా సంజయ్, ఏ 2గా సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా, ఏ 3గా క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.
అగ్నిమాపక శాఖలో నిరభ్యంతర పత్రాలు ఆన్లైన్లో జారీ చేసేందుకు అగ్ని - ఎన్వోసీ వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్‌లు సరఫరా కాంట్రాక్టును సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా సంస్థకు సంజయ్ అప్పగించారు. ఎలాంటి పనులు జరగకపోయినా ఆ సంస్థకు రూ.59.93 లక్షల బిల్లులు చెల్లించేశారు. సీఐడీ తరపున ఎస్సీ, ఎస్టీ, ఎట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్టును క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌కు ఇచ్చి రూ.1.19 కోట్లు చెల్లించారు.
అయితే సదస్సులు మొత్తం సీఐడీ అధికారులే నిర్వహించారు. క్రిత్వ్యాప్ సంస్థ అసలు సదస్సులే నిర్వహించకపోయినా బిల్లుల పేరిట దోపిడీ చేశారని, ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.2 కోట్ల మేర నష్టం కలిగించారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి రెండు వేర్వేరు నివేదికలు సమర్పించింది. వాటి ఆధారంగా ఇప్పటికే సంజయ్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేయగా, తాజాగా ఏసీబీ కేసు నమోదు చేసింది. సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా, క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ సంస్థల ఖాతాల్లో జమ అయిన సొమ్ము ఎవరు విత్ డ్రా చేశారు? అంతిమంగా ఎవరి వద్దకు చేరిందనే దానిపై ఏసీబీ విచారణ చేయనుంది.