Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడిన పాకిస్థాన్.. 15 మంది మృతి

15 dead in Pak airstrikes in Afghanistan border
  • సరిహద్దు జిల్లాలోని గ్రామాలను లక్ష్యంగా చేసుకున్న పాకిస్థాన్
  • బాంబుల వర్షం కురిపించిన పాక్ విమానాలు
  • ఒక గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి
  • టీటీపీ ఉగ్రవాదులకు ఆఫ్ఘన్ ఆశ్రయమిస్తోందని పాక్ ఆరోపణ
ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని పక్టికా ప్రావిన్సులోని బర్మాల్ జిల్లాను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా 15 మంది వరకు మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మొత్తంగా ఏడు గ్రామాలపై దాడులు జరిగాయి. లమన్ అనే గ్రామంలో జరిగిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

పాక్ దాడులను తాలిబన్ రక్షణ మంత్రిత్వశాఖ ఖండించింది. తమ భూభాగాన్ని, సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడం తమ చట్టబద్ధమైన హక్కు అని పేర్కొంది. మృతుల్లో ‘వజిరిస్థానీ శరణార్థులు’ కూడా ఉన్నట్టు తెలిపింది. పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఇటీవలి కాలంలో ఉద్రిక్తతలు పెరిగాయి. తమ భూభాగంలో జరుగుతున్న ఉగ్ర దాడులకు తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) కారణమని, తాలిబన్ ప్రభుత్వం వారికి ఆశ్రయం ఇస్తోందని పాక్ పదే పదే ఆరోపిస్తోంది. అయితే, ఈ ఆరోపణలను ఆఫ్ఘనిస్థాన్ ఖండిస్తోంది. తాజా దాడుల్లో మరణించిన వారందరూ పౌరులేనని పేర్కొంది. 
Afghanistan
Pakistan
Airstrikes
TTP Terrorists

More Telugu News