Padi Kaushik Reddy: విచారణకు హాజరుకావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు
- బంజారాహిల్స్ సీఐ విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు
- సీఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మాసబ్ ట్యాంక్ పోలీసులు
- ఈ నెల 27వ తేదీ ఉదయం విచారణకు రావాలంటూ నోటీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మాసబ్ ట్యాంక్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27వ తేదీ ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్ కు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించాడంటూ గతంలో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసిన సంగతి విదితమే. ఆయనతో పాటు వెళ్లిన ఆయన అనుచరులు 20 మందిపై కూడా కేసు నమోదయింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐజీ శివధర్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ పీఎస్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన సమయంలో ఆయన సీఐతో వాగ్వాదానికి దిగారు. వేరే పని మీద వెళ్తున్న సీఐ వాహనాన్ని అడ్డుకోవడమే కాకుండా ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో బంజారాహిల్స్ సీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాసబ్ ట్యాంక్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో కౌశిక్ రెడ్డిని ఈ నెల 6న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు... కోర్టు వెంటనే ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసు విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే విచారణకు హాజరుకావాలని కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.