Vijayashanti: సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్న టాలీవుడ్ ప్రముఖులు.. విజయశాంతి ఏమన్నారంటే..!
- ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో ఈరోజు సీఎంతో సమావేశం
- సీఎంతో భేటీపై హీరోలు, దర్శకనిర్మాతలకు దిల్ రాజు సమాచారం
- ఈ సమావేశంపై ఎక్స్ వేదికగా స్పందించిన నటి విజయశాంతి
- ఈ భేటీలో సినీ ఇండస్ట్రీకి సంబంధించి విశ్లేషణాత్మకంగా చర్చ జరగాలని వ్యాఖ్య
ఇవాళ ఉదయం 10 గంటలకు టాలీవుడ్ ప్రముఖులు ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. టాలీవుడ్ డైరెక్టర్లు, నిర్మాతలు అందరం కలిసి ముఖ్యమంత్రిని కలుస్తామని దిల్ రాజు తెలిపారు. ఇప్పటికే సీఎంతో భేటీపై హీరోలు, దర్శకనిర్మాతలకు దిల్ రాజు సమాచారం ఇచ్చారు. అయితే, నేడు జరగబోయే భేటీపై కాంగ్రెస్ నేత, నటి విజయశాంతి 'ఎక్స్'(ట్విట్టర్) వేదికగా స్పందించారు.
"తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో గురువారం టాలీవుడ్ ప్రముఖులు సమావేశం కానున్నారు. ఈ భేటీలో సినీ ఇండస్ట్రీకి సంబంధించి విశ్లేషణాత్మకంగా చర్చ జరగాలి. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు, ఇతర రాయితీలపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అలాగే తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేలా సినిమాలు, చిన్నస్థాయి కళాకారులు, సాంకేతిక నిపుణులు, వారి ఉద్యోగ భద్రత, జీవన ప్రమాణాలు, చిన్న, మధ్య స్థాయి బడ్జెట్ చిత్రాలకు థియేటర్ల కేటాయింపు.. తదితర అంశాలపై విశ్లేషణాత్మకంగా చర్చ జరగాలి" అని విజయశాంతి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.