YSRCP: 27న విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త నిరసన జయప్రదం చేయాలి: సజ్జల రామకృష్ణారెడ్డి
- రాష్ట్ర ప్రజలపై రూ.15 వేల విద్యుత్ చార్జీల భారం మోపడం దారుణమన్న సజ్జల
- అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శనలను విజయవంతం చేయాలన్న సజ్జల
- వైసీపీ జిల్లా అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్‌లో నిరసనలపై దిశానిర్దేశం చేసిన సజ్జల
కూటమి సర్కార్ విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27న తలపెట్టిన ర్యాలీలు, వినతి పత్రాల సమర్పణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి బుధవారం ఆయన జిల్లా పార్టీ అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం వేయడం దుర్మార్గమన్నారు. పెంచిన చార్జీలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించి వినతి పత్రాలను సమర్పించాలన్నారు. అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జిలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలన్నారు.
రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో ఇప్పటికే పార్టీ శ్రేణులతో సమావేశాలు జరిగాయన్నారు. అన్ని జిల్లాల్లోనూ వైసీపీ పోరుబాట పోస్టర్ల ఆవిష్కరణలు నిర్వహించారన్నారు. వైసీపీ చేపట్టిన ఈ నిరసనలపై ఇప్పటికే ప్రజల్లో ఆదరణ కనిపిస్తోందని సజ్జల అన్నారు. ప్రజా సమస్యలపై వైసీపీ బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తోందని తెలిపారు.
విద్యుత్ చార్జీల పెంపు భారం అన్ని వర్గాలపై పడుతోందన్నారు. దీంతో ఆయా వర్గాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. వీరంతా వైసీపీ తలపెట్టిన నిరసనల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ క్రమంలో ప్రజా సంఘాలు, సంస్థలను కలుపుకుని నిరసన ప్రదర్శనలు పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.