CPI Narayana: రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ నేపథ్యంలో.. సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

CPI Narayana comments on tollywood people meeting with CM Revanth Reddy

  • టికెట్ల రేట్లను పెంచడమంటే బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహించడమేనన్న నారాయణ
  • క్రైమ్, అశ్లీలతలను పెంచే సినిమాలకు ప్రోత్సాహకాలు ఎందుకని ప్రశ్న
  • హీరోలు రోడ్ షోలు చేయడం సరికాదని వ్యాఖ్య

కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఈ భేటీ నేపథ్యంలో సీపీఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలపై భారం మోపకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆయన అన్నారు. సినిమా టికెట్ల రేట్లను పెంచడం అంటే... బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహించడమే అవుతుందని చెప్పారు. 

సినిమా వాళ్లు వేల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారని నారాయణ అన్నారు. వెయ్యి కోట్లు పెట్టి సినిమా తీసి... రెండు వేల కోట్లు వసూలు చేస్తున్నారని విమర్శించారు. సినిమా టికెట్ల రేట్ల పెంపును ప్రభుత్వాలు ఎందుకు ప్రోత్సహించాలని ప్రశ్నించారు. సందేశాత్మక చిత్రాలకైతే ప్రోత్సాహకాలు ఇవ్వాలని... క్రైమ్, అశ్లీలతలను పెంచే సినిమాలకు ప్రోత్సాహకాలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ఎర్ర చందనం స్మగ్లర్ ని హీరోగా చూపించి... దాన్ని యువత మీద రుద్దుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. 

సినిమా హీరోలు రోడ్ షోలు చేయడం సరికాదని నారాయణ అన్నారు. హీరోలు వచ్చినప్పుడు అభిమానులు వెంట పడటం సహజమని చెప్పారు. ఇలాంటి రోడ్ షోలకు అనుమతించకూడదని సూచించారు. మరోవైపు, సినీ ప్రముఖులతో సీఎం భేటీ నేపథ్యంలో... ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంలో సర్వత్ర ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News