Virat Kohli: బాక్సింగ్ డే టెస్టులో కోహ్లీ వివాదం.. ఒక మ్యాచ్ నిషేధం?

What ICC Rulebook Says On the Virat Kohli and Sam Konstas row in Boxing day test

  • పిచ్‌పై నడిచి వెళుతున్న ఆసీస్ బ్యాటర్ కొంస్టాస్‌ను భుజంతో ఢీకొట్టిన విరాట్
  • ఉద్దేశపూర్వకంగానే తాకాడంటూ మొదలైన వివాదం
  • లెవల్-2 నేరంగా తేలితే తదుపరి మ్యాచ్‌పై నిషేధ విధించే అవకాశం
  • లెవల్-1గా నిర్ధారణ అయితే జరిమానాతో సరిపెట్టనున్న మ్యాచ్ రిఫరీ

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్ఠాత్మక ఎంసీజీ (మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్) మైదానం వేదికగా బాక్సింగ్ డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అరంగేట్ర బ్యాటర్ సామ్ కొంస్టాస్, విరాట్ కోహ్లీ మధ్య వివాదం చెలరేగింది. ఓవర్ పూర్తయ్యాక పిచ్‌పై అవతలి క్రీజు వైపు నడిచి వెళుతున్న కొంస్టాస్‌ను అటుగా బంతి పట్టుకొని వస్తూ విరాట్ కోహ్లీ భుజంతో బలంగా ఢీకొట్టడం వివాదంగా మారింది. మొదటి రోజు చోటుచేసుకున్న ఈ ఘటనలో విరాట్ కోహ్లీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

విరాట్ ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యకు పాల్పడినట్టు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆసీస్ క్రికెట్ దిగ్గజాలు రికీ పాంటింగ్, మైఖేల్ వాన్ వంటివారు కూడా కోహ్లీని తప్పుబడుతున్నారు. ఐసీసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ తరహా ఘటనలు ఐసీసీ రూల్‌బుక్‌లోని 2.12 నిబంధన కిందకు వస్తాయి. అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆటగాడు, సహాయక సిబ్బంది, అంపైర్, మ్యాచ్ రిఫరీ లేదా ప్రేక్షకుల సహా ఇతర ఏ వ్యక్తినైనా అనుచిత రీతిలో శరీరాన్ని తాకితే ఈ రూల్ వర్తిస్తుంది.

క్రికెట్‌లో ఈ విధమైన ప్రవర్తన నిషేధమని, ఉద్దేశపూర్వకంగా, నిర్లక్ష్యంగా ఎదుటి ఆటగాడితో ఈ విధంగా ప్రవర్తిస్తే నిబంధన ఉల్లంఘించినట్టేనని ఐసీసీ రూల్‌బుక్ పేర్కొంది. ఉల్లంఘన తీవ్రత, కారణాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా లేదా నిర్లక్ష్యంగా ఉందా లేదా నిర్ధారించాల్సి ఉంటుంది. ప్లేయర్స్‌తో మాట్లాడిన తర్వాత తీవ్రతను మ్యాచ్ రిఫరీ నిర్ణయించాల్సి ఉంటుంది.

ఈ విషయంలో ఐసీసీ మ్యాచ్ రిఫరీదే తుది నిర్ణయం అవుతుంది. లెవల్-2 నేరంగా భావిస్తే కోహ్లీకి 3-4 డీమెరిట్ పాయింట్లు ఇస్తారు. అలాంటి పరిస్థితిలో కోహ్లీ తదుపరి మ్యాచ్‌లో ఆడకుండా నిషేధం విధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ లెవల్-1 నేరంగా పరిగణనలోకి తీసుకుంటే జరిమానాతో సరిపెడతారు.

  • Loading...

More Telugu News