Viral Video: భార్యను చూసుకునేందుకు ఉద్యోగానికి వలంటరీ రిటైర్మెంట్.. ఫేర్‌వెల్ పార్టీలో స్టేజిపైనే భార్య మృతి

Man takes voluntary retirement to care for wife and she dies at his farewell party

  • రాజస్థాన్‌లోని కోటాలో ఘటన
  • హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న భార్య కోసం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ
  • ఫేర్‌వెల్ పార్టీలో సంతోషంగా కనిపించిన దీపిక
  • ఆ వెంటనే కుప్పకూలి మృతి

అనారోగ్యంతో బాధపడుతున్న భార్య బాగోగులు చూసేందుకు ఉద్యోగానికి వలంటరీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా ఉద్యోగులందరూ కలిసి ఆయనకు ఫేర్‌వెల్ పార్టీ ఇచ్చారు. భార్యను కూడా ఈ వేడుకకు తీసుకొచ్చాడాయన. ఫంక్షన్ జరుగుతుండగానే వేదికపైనే ఆమె కుప్పకూలి మృతి చెందింది. ఈ విషాదకర ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. 

ఆయన పేరు దేవేంద్ర సందాల్. కోటాలోని డకానియా ప్రాంతంలో సెంట్రల్ వేర్‌హౌస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన భార్య దీపిక (50) కొన్ని సంవత్సరాలుగా హృద్రోగ సమస్యలతో బాధపడుతోంది. పిల్లలు లేకపోవడంతో ఆమె బాగోగులను దగ్గరుండి చూసుకునేందుకు ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ ప్రకటించారు. దీంతో ఆయనకు తోటి ఉద్యోగులు ఫేర్‌వెల్ పార్టీ ఏర్పాటు చేశారు. 

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. దీపిక, దేవేంద్ర ఇద్దరూ దండలు ధరించి నిల్చున్నారు. చుట్టూ ఉన్న సహోద్యోగులు చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దీపిక కొంత అసౌకర్యానికి గురై కుర్చీలో కూర్చున్నారు. ఆ తర్వాత భారంగా ఊపిరి తీసుకోవడం కనిపించింది. గమనించిన భర్త ఆమె వెన్ను నిమరడంతో ఆమె నవ్వడం కనిపించింది. అది చూసిన కొందరు ‘ఆమెకు మైకం కమ్మేలా ఉంది. నీళ్లు తీసుకురండి’ అని అనడం వినిపించింది. 

ఆ వెంటనే ఆమె కుప్పకూలి ముందున్న టేబుల్‌పై తలవాల్చేసింది. అది చూసిన భర్త ఆమె పరిశీలిస్తూ నీళ్లు తీసుకురండి అని కోరాడు. ఆ తర్వాత క్షణాల్లోనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్టు నిర్ధారించారు. 

దేవేంద్రకు మరో మూడేళ్లు సర్వీసు ఉండగానే భార్యను చూసుకునే ఉద్దేశంతో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆయన విజ్ఞప్తికి అనుమతి రావడంతో కార్యాలయంలో చివరి రోజున సహోద్యోగులు వీడ్కోలు పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగానే ఈ ఘటన జరిగింది. ఎవరి కోసమైతే వలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడో.. ఆమె తన కళ్లముందే మరణించడంతో దేవేంద్ర కన్నీటి పర్యంతమయ్యారు. 

  • Loading...

More Telugu News