Mamata Banerjee: కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ మధ్య దూరం గురించి ప్రశ్నించగా... హ్యాపీ న్యూ ఇయర్ అంటూ నవ్వేసిన మమతా బెనర్జీ!

Mamata Banerjee Happy New Year Response To  AAP Congress Row
  • ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముంగిట... కాంగ్రెస్ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ
  • పార్టీల మధ్య పెరిగిన దూరం గురించి మమతను ప్రశ్నించిన విలేకరులు
  • కొత్త సంవత్సరంలో వారి ప్రయాణం సురక్షితంగా ఉండాలన్న బెంగాల్ సీఎం
ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య రోజురోజుకూ పెరుగుతున్న దూరంపై పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని ప్రశ్నించగా... నవ్వుతూ 'హ్యాపీ న్యూ ఇయర్' అని వ్యాఖ్యానించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. దీంతో ఇరుపార్టీల నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని బయటకు పంపించేలా ఇతర పార్టీలతో మాట్లాడతామని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈ క్రమంలో, మీడియా ప్రతినిధులు... మమతా బెనర్జీని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పెరిగిన దూరం గురించి మీరేమంటారు? అని విలేకరులు ప్రశ్నించారు. దీనికి ఆమె బదులిస్తూ, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ నవ్వేశారు.

ఇంకా మాట్లాడుతూ, వారికి (కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ) కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, కొత్త సంవత్సరంలో వారి ప్రయాణం సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. మనందరికీ కొత్త సంవత్సరం ఆనందదాయకంగా ఉండాలని ఆకాంక్షించారు.
Mamata Banerjee
AAP
Congress
BJP

More Telugu News