manmohan singh passed away: దేశానికి తీరని లోటు.. మన్మోహన్ మృతిపై రాష్ట్రపతి ముర్ము స్పందన
- మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
- భరతమాత ముద్దుబిడ్డల్లో మన్మోహన్ ఒకరన్న ద్రౌపది ముర్ము
- విద్య, పరిపాలనను సమానంగా విస్తరింపజేసిన అరుదైన రాజకీయ నాయకుల్లో మన్మోహన్ సింగ్ ఒకరని కితాబు
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విద్య, పరిపాలనను సమానంగా విస్తరింపజేసిన అరుదైన రాజకీయ నాయకుల్లో మన్మోహన్ సింగ్ ఒకరని అన్నారు. భారత ఆర్ధిక వ్యవస్థను సంస్కరించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
దేశానికి ఆయన చేసిన సేవ, ఆయన రాజకీయ జీవితం, వినయంతో కూడిన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని అన్నారు. భరతమాత ముద్దుబిడ్డల్లో ఒకరైన మన్మోహన్‌కు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తూ ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు.
మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీ సహా అనేక మంది ప్రముఖులు తమ సంతాపాలను వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి వార్త రాజకీయాలకు అతీతంగా అందరినీ విషాదానికి గురి చేసింది. మన్మోహన్ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.