Gautam Adani: మన్మోహన్ రాబోయే తరాలకు స్ఫూర్తి: గౌతమ్ అదానీ
- మన్మోహన్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన గౌతమ్ అదానీ
- ఆయన నాయకత్వం, వినయం దేశానికి సేవ చేయడంలో మాస్టర్‌క్లాస్ అని వ్యాఖ్య
- మృదువుగా మాట్లాడిన అరుదైన నాయకుడన్న అదానీ
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వృద్ధాప్య సమస్యలతో గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన మృతి తీరని లోటు అని పేర్కొన్నారు.
మన్మోహన్ మృతి నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా సంతాపం ప్రకటిస్తూ, తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారతదేశాన్ని పునర్నిర్మించిన, ప్రపంచానికి తలుపులు తెరిచిన పరివర్తనాత్మక 1991 సంస్కరణల్లో ఆయన కీలక పాత్రను చరిత్ర ఎప్పటికీ గౌరవిస్తుందని అన్నారు.
మృదువుగా మాట్లాడి, తన చర్యల ద్వారా స్మారక పురోగతిని సాధించిన అరుదైన నాయకుడు అని అదానీ కొనియాడారు. డాక్టర్ సింగ్ నాయకత్వం, వినయం అనేవి దేశానికి సేవ చేయడంలో మాస్టర్‌క్లాస్‌గా మిగిలిపోతాయన్నారు. ఇది రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని గౌతమీ అదానీ పేర్కొన్నారు.