cm chandrababu naidu: పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు
- ఈ నెల 31న నరసరావుపేట మండలం యల్లమంద గ్రామంలో చంద్రబాబు పర్యటన
- పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
- గ్రామంలో హెలిపాడ్, వేదిక ఏర్పాట్లపై సమీక్ష జరిపిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పల్నాడు జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 31న పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం యల్లమంద గ్రామంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఆ గ్రామంలో సీఎం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
జనవరి 1న ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోనుండటంతో ఒక రోజు ముందుగానే పింఛన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో 31వ తేదీనే పింఛన్ల పంపిణీని చంద్రబాబు ఆ గ్రామం నుంచి ప్రారంభించనున్నారు. అనంతరం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని చంద్రబాబు దర్శించుకోనున్నారు.
ఈ నేపథ్యంలో యల్లమంద గ్రామంలో సభా వేదిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ముందుగా నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జనవరి 1న పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పులిపాడు గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని ప్రచారం జరిగింది. దీంతో ఆ గ్రామంలో ఏర్పాట్లు చేస్తుండగా, సీఎం పర్యటనలో మార్పు చోటుచేసుకుంది.
సీఎం పర్యటన ఖరారైన నేపథ్యంలో గురువారం జిల్లా కలెక్టర్ యల్లమంద గ్రామంలో పర్యటించారు. అక్కడ హెలిపాడ్ నిర్మాణానికి అనువైన స్థలంతో పాటు సభా వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.