sonu sood: నాకు సీఎం ఆఫర్ వచ్చింది... కానీ...!: సోనూ సూద్
- కొవిడ్ సమయంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేసిన సోనూ సూద్
- సీఎం, డిప్యూటీ సీఎం, రాజ్యసభ ఆఫర్లు వచ్చాయన్న సోనూ సూద్
- రాజకీయాల్లోకి వచ్చి స్వేచ్చను కోల్పోవడం ఇష్టం లేదన్న సోనూ సూద్
పలువురు సినీ నటులు, నటీమణులు రాజకీయ రంగంలోకి అడుగు పెట్టి రాణించారు. రాణిస్తున్నారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి అగ్రనటులు ముఖ్యమంత్రులుగానూ బాధ్యతలు నిర్వహించారు. పలువురు నటీనటులు ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఎన్నికై కేంద్ర, రాష్ట్ర మంత్రులు గానూ పని చేశారు. దీంతో కరోనా సమయంలో ఎంతో మందికి తన వంతు సాయం అందించి రియల్ హీరోగా గుర్తింపు పొందిన బాలీవుడ్ స్టార్ నటుడు సోనూ సూద్ కూడా రాజకీయాల్లోకి రానున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై ఆయన తాజాగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఓ మూవీ ప్రమోషన్లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో సోనూ సూద్ మాట్లాడుతూ.. కొవిడ్ సమయంలో ప్రజలకు సాయం చేసినందుకు తనకు సీఎం, డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యుడు అయ్యే అవకాశాలు వచ్చాయని పేర్కొన్నారు. అయితే, ఆ అభ్యర్ధనలను తిరస్కరించినట్లు చెప్పారు. స్వేచ్ఛను కోల్పోవడం ఇష్టం లేదని, అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నానని సోనూ సూద్ తెలిపారు.
సాధారణంగా ప్రజలు రెండు కారణాలతో రాజకీయాల్లోకి వస్తారని, ఒకటి డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసమని, అయితే తనకు వీటిలో దేనిపైనా ఆసక్తి లేదని సోనూ సూద్ అన్నారు. ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటే తాను ఇప్పటికే అది చేస్తున్నానని పేర్కొన్నారు.