aditya om: తెలంగాణలో ఓ గిరిజన గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పిస్తున్న సినీ హీరో
- కలుషిత నీటితో ఇబ్బందులు పడుతున్న చెరుపల్లి గ్రామస్తులు
- చెరుపల్లిలో తాగు నీటి సమస్య తీర్చేందుకు ముందుకు వచ్చిన నటుడు ఆదిత్య ఓం
- సంక్రాంతిలోపు ఆర్వో ప్లాంట్ అందుబాటులోకి
రాజకీయ నాయకులు, ప్రముఖులు, సెలబ్రిటీలు తమ సేవా కార్యక్రమాల్లో భాగంగా గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఆ గ్రామాల్లో ప్రజల అవసరాలు తీరుస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటుంటారు. ఈ క్రమంలోనే సినీ నటుడు ఆదిత్య ఓం తెలంగాణలోని గిరిజన గ్రామం చెరుపల్లిలో నీటి సమస్య పరిష్కరించేందుకు ముందుకొచ్చి తన దొడ్డ మనసును చాటుకున్నారు. ఆ గ్రామస్తులు కలుషిత నీటితో పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న ఆదిత్య ఓం .. గ్రామంలో నీటి సమస్య పరిష్కరించేందుకు ముందుకు వచ్చారు.
సురక్షితమైన మంచినీరు గ్రామస్తులకు అందించేందుకు ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి సంక్రాంతి పండుగ నుంచి ఆర్వో ప్లాంట్ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ ప్లాంట్ ద్వారా సురక్షిత తాగు నీరు అందుబాటులోకి వస్తే తమకు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చెరుపల్లి గ్రామస్తులు అదిత్య ఓంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
ఇక ఆదిత్య ఓం సినీ కెరీర్ విషయానికి వస్తే 'లాహిరి లాహిరి లాహిరి' మూవీతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఆయన.. గత ఏడాది 'నాతో నేను' మూవీలో కీలక పాత్రలో కనిపించాడు. ఈ ఏడాది పాప్యులర్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8లో సందడి చేశాడు. తాజాగా 'బందీ' మూవీలో ఆదిత్య ఓం నటిస్తున్నాడు.
.