sunil gavaskar: కోహ్లీ మరోసారి అలా చేయడని అనుకుంటున్నా: గవాస్కర్
- కొహ్లీ, సామ్ కాన్‌స్టాస్ మధ్య వివాదంపై స్పందించిన గవాస్కర్
- ఆటగాళ్లలో పోటీతత్వం ఆటపరంగా మాత్రమే ఉండాలన్న గవాస్కర్
- క్రికెట్‌లో ఏ స్థాయిలోనూ ఇలాంటి ఘటనలు జరగకూడదన్న గవాస్కర్
విరాట్ కోహ్లీకి భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక సూచన చేశారు. ఆస్ట్రేలియా ఓపెనర్ సామ్ కాన్‌స్టాస్, విరాట్ కోహ్లీ మద్య జరిగిన వాగ్వివాదంపై స్పందించిన గవాస్కర్ .. ఆటగాళ్లలో పోటీతత్వం ఆటపరంగా మాత్రమే ఉండాలని చెప్పారు. కొహ్లీ, సామ్ కాన్‌స్టాస్ మధ్య వాగ్వాదానికి గల కారణం ఏమిటో తనకు కచ్చితంగా తెలియదని కానీ నిజంగా ఈ గొడవ అవసరం లేదన్నారు. క్రికెట్‌లో ఏ స్థాయిలో అయినా ఇలాంటి ఘటనలు జరగకూడదని సూచించారు.
ఆటపరంగా తీవ్రమైన పోటీతత్వం ఉంటే తప్పులేదని, ఇలాంటివి మాత్రం అవసరం లేదన్నారు. మనమందరం కోహ్లీని ఆటలో గొప్ప క్రికెటర్లలో ఒకరిగా గుర్తుంచుకుంటున్నామని, ఐసీసీ జరిమానా విధించిన వ్యక్తిగా కాదని అన్నారు. కోహ్లీ మరోసారి అలా చేయకూడదని భావిస్తున్నానన్నారు. కోహ్లీలో పోటీతత్వం అంతర్లీనంగా ఉందన్నారు. వికెట్ పడ్డ ప్రతిసారి ఎలా సంబరాలు చేసుకుంటాడో మనం చూశామని, దానిలో తప్పేమి లేదన్నారు. కానీ అది భౌతికంగా ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని గవాస్కర్ సూచించారు.
అసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి రోజు ఆట సందర్భంగా ఆస్ట్రేలియా ఓపెనర్ సామ్ కాన్‌స్టాస్, విరాట్ కోహ్లీ మధ్య వాగ్వివాదం చోటుచేసుకోవడం, దానికి ఐసీసీ విరాట్ కోహ్లీపై చర్యలు తీసుకోవడం తెలిసిందే. మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధిస్తూ.. అతడి ఖాతాలో ఒక డీ మెరిట్ పాయింట్‌ను ఐసీసీ జోడించింది.