Virat Kohli: అరంగేట్ర ఆటగాడితో వాగ్వాదం.. కోహ్లీని ఘోరంగా అవమానించిన ఆసీస్ మీడియా!
- మెల్బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు
- అరంగేట్ర ఆటగాడు సామ్ కాన్స్టాస్, విరాట్ కోహ్లీ మధ్య వివాదం
- కోహ్లీని సర్కస్ జోకర్‌తో పోల్చిన ఆసీస్ మీడియా
- అక్కడి మీడియాలో 'క్లౌన్ కోహ్లీ' పేరిట కథనాలు
మెల్బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అరంగేట్ర ఆటగాడు సామ్ కాన్స్టాస్, విరాట్ కోహ్లీ మధ్య వివాదం చెలరేగింది. గురువారం ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టులో తొలి రోజు ఆటలో కాన్స్టాస్ ను కోహ్లీ భుజంతో బలంగా ఢీ కొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వివాదం నేపథ్యంలో ఆస్ట్రేలియా మీడియా విరాట్ కోహ్లీని ఘోరంగా అవమానించింది. సర్కస్ జోకర్‌తో పోల్చింది. అక్కడి మీడియాలో 'క్లౌన్ కోహ్లీ' పేరిట కథనాలు వెలువడ్డాయి.
కోహ్లీ, కాన్స్టాస్ మధ్య వాగ్వాదం..
ఇన్నింగ్స్ పదో ఓవర్ అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. సామ్ కాన్స్టాస్ దూకుడుగా ఆడుతుండడంతో అతడిని కోహ్లీ కవ్వించే ప్రయత్నం చేశాడు. ఈ ఓవర్ అనంతరం యువ ఆటగాడు నడుచుకుంటూ మరో ఎండ్‌కు వెళుతున్న సమయంలో ఎదురుగా వెళ్లిన కోహ్లీ అతడి భుజాన్ని బలంగా ఢీకొట్టాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
కోహ్లీకి షాకిచ్చిన ఐసీసీ..
ఈ ఘటన నేపథ్యంలో విరాట్ కోహ్లీకి ఐసీసీ షాకిచ్చింది. నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంతో కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానాగా విధించింది. అంతేగాక అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చింది.