Jagan: పెండింగ్ బిల్లుల గురించి అడిగిన వైసీపీ నేతలు, కాంట్రాక్టర్లపై జగన్ అసహనం
- నిన్న పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించిన జగన్
- వైసీపీ హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదంటూ కాంట్రాక్టర్ల రచ్చ
- లాఠీఛార్జ్ చేసిన పోలీసులు
వైసీపీ అధినేత జగన్ నిన్న పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించిన సంగతి తెలిసిందే. జగన్ ని కలిసేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదంటూ కొందరు వైసీపీ నేతలు, కాంట్రాక్టర్లు అక్కడ రచ్చ చేశారు. జగన్ ను కలిసేందుకు క్యాంపు కార్యాలయంలోకి దూసుకుపోయే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో కార్యాలయం ద్వారం వద్ద తోపులాట జరిగింది. ద్వారం పక్కనున్న అద్దం పగిలిపోయింది. అద్దం ముక్కలు గుచ్చుకుని కొందరికి గాయాలయ్యాయి. తోపులాటను అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు, కాంట్రాక్టర్లతో జగన్ మాట్లాడుతూ... 'ఇప్పుడు కూడా బిల్లులు అడుగుతున్నారేందన్నా... ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా అన్నా?' అని అసహనం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు బిల్లులు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయి. దీంతో, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది కాంట్రాక్టర్లు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే పనులు చేసిన కొందరు వైసీపీ నేతలు, కాంట్రాక్టర్లు బిల్లులపై జగన్ ను ప్రశ్నించే ప్రయత్నం చేశారు.