Dola Bala Veeranjaneya Swami: అందుకే జగన్‌కు ప్రజలు 'పవర్' పీకేశారు.. మాజీ సీఎంపై మంత్రి డోలా ధ్వజం!
- జగన్ చేసిన పాపాలు ఇప్పటికీ రాష్ట్ర ప్రజలను వెంటాడుతున్నాయన్న మంత్రి
- తాను పెంచిన ఛార్జీలపై తన పార్టీ శ్రేణులతో ధర్నా చేయించడం జగన్ సైకో చర్య అని వ్యాఖ్య
- ఆనాడు పవర్ ఛార్జీలు పెంచినందుకే.. ఆయనకు ప్రజలు పవర్ పీకేశారంటూ చురకలు
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్ల పాలనలో జగన్ చేసిన పాపాలు ఇప్పటికీ రాష్ట్ర ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయని ధ్వజమెత్తారు.
తాను పెంచిన ఛార్జీలపై తన పార్టీ శ్రేణులతో ధర్నా చేయించడం జగన్ సైకో చర్యగా మంత్రి పేర్కొన్నారు. ఏపీఈఆర్‌సీ అనుమతించిన దాని కన్నా రూ. 19వేల కోట్లు అదనంగా విద్యుత్ కొనుగోళ్లకు వెచ్చించడం నిజం కాదా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రజలపై నాడు విద్యుత్ భారాలు మోపి.. నేడు ఏమీ తెలియనట్లు ధర్నాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని అన్నారు.
యూనిట్ కేవలం రూ.5కే వచ్చే విద్యుత్‌ను జగన్ సర్కార్ కమీషన్ల కోసం బహిరంగంగా మార్కెట్‌లో రూ. 8 నుంచి రూ. 14 వరకు ఖర్చు చేసి కొనుగోలు చేసిందని మంత్రి డోలా ఆరోపించారు. ఆయన అవినీతి, ధన దాహం కారణంగానే ప్రజలపై భారం పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆనాడు పవర్ ఛార్జీలు పెంచినందుకే.. ఆయనకు ప్రజలు పవర్ పీకేశారని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేద్దామనుకుంటే.. అది తిరిగి మన దగ్గరికి వస్తుందని, ఈ విషయం ఇకనైనా జగన్ తెలుసుకోవాలని మంత్రి హితవు పలికారు.