Peddireddi Ramachandra Reddy: విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ధర్నాలు.. చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఫైర్
- రూ. 15,485 కోట్ల భారం మోపారంటూ వైసీపీ మండిపాటు
- విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చంద్రబాబు హామీ ఇచ్చారన్న పెద్దిరెడ్డి
- ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న ఉచిత విద్యుత్ కు కూడా మంగళం పలుకుతున్నారని ఆగ్రహం
విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ప్రజలపై రూ. 15,485 కోట్ల భారం మోపారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని విద్యుత్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో మాట్లాడుతూ... విద్యుత్ బిల్లుల బాదుడుతో ప్రజలను ప్రభుత్వం దోచుకుంటోందని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలను పెంచబోమని, వీలైతే తగ్గిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని... ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని అన్నారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించకపోగా... రూ. 15,485 కోట్ల బాదుడుకి చంద్రబాబు శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కు కూడా మంగళం పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి ఉచిత విద్యుత్ ను కొనసాగించాలని డిమాండ్ చేశారు.