Manmohan Singh: గుండె శస్త్రచికిత్స తర్వాత మన్మోహన్ సింగ్ మాట్లాడిన తొలి మాట ఇదే!

how is my country and how is Kashmir Manmohan Singh Asked After Heart Surgery
  • 2009లో కరోనరీ బైపాస్ సర్జరీ చేయించుకున్న మన్మోహన్ సింగ్
  •  దాదాపు 11 గంటలపాటు కొనసాగిన గుండె శస్త్రచికిత్స
  • ‘బ్రీత్ పైప్’ తొలగించిన వెంటనే దేశం ఎలా ఉందని అడిగిన మాజీ ప్రధాని
  • ఆ వెంటనే కశ్మీర్ ఎలా ఉందని ప్రశ్నించిన వైనం
  • ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఢిల్లీ ఎయిమ్స్ సీనియర్ కార్డియాక్ సర్జన్ రమాకాంత్ 
దేశ ఆర్థిక వ్యవస్థ సంస్కర్త, వరుసగా రెండు పర్యాయాలు దేశానికి ప్రధానిగా విశేష సేవలు అందించిన కాంగ్రెస్ కురువృద్ధుడు మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. దేశం పట్ల ఆయన ఎంత నిబద్ధత, చిత్తశుద్ధితో వ్యవహరించారో తెలియజేసే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మన్మోహన్ సింగ్ గుండె శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత ఆయన మాట్లాడిన తొలి మాట ఏమిటో ఢిల్లీ ఎయిమ్స్ సీనియర్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండా వెల్లడించారు. 

2009లో ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్ గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారని, దాదాపు 11 గంటల సుదీర్ఘ సమయం పాటు కరోనరీ బైపాస్ సర్జరీ జరిగిందని రమాకాంత్ పాండా చెప్పారు. శస్త్రచికిత్స ముగిసిన తర్వాత రాత్రి సమయంలో మొదటి ‘బ్రీత్ పైప్’ను తొలగించామని, దీంతో తొలి మాటగా "దేశం ఎలా ఉంది?" అంటూ మన్మోహన్ అడిగారని ఆయన చెప్పారు. ఆ వెంటనే "కశ్మీర్ ఎలా ఉంది?" అని అడిగారని వెల్లడించారు.

మొదటి మాట ఆరోగ్యం గురించి కాకుండా దేశం గురించి అడగడం ఆశ్చర్యం కలిగించిందని డాక్టర్ రమాకాంత్ పాండా అన్నారు. శస్త్రచికిత్స గురించి ఏమీ అడగలేదేంటని తాను ప్రశ్నించగా... ‘‘మీరు మంచిగా పనిచేస్తారని నాకు తెలుసు. నేను శస్త్రచికిత్స గురించి ఆందోళన చెందడం లేదు. నా దేశం గురించి ఎక్కువ ఆందోళన పడుతున్నాను’’ అంటూ మన్మోహన్ సింగ్ సమాధానం ఇచ్చారని డాక్టర్ గుర్తుచేసుకున్నారు.

మాజీ ప్రధాని గొప్ప మానవతావాది అని, వినమ్రమైన వ్యక్తి అని, గొప్ప దేశభక్తుడు అని డాక్టర్ రమాకాంత్ కొనియాడారు. ఒక వైద్యుడి కోణంలో చూస్తే ఆదర్శవంతమైన పేషింట్ అని తాను చెబుతానని చెప్పారు. ఇటువంటి శస్త్రచికిత్సల అనంతరం రోగులు సాధారణంగా ఛాతీ నొప్పి గురించి ఫిర్యాదులు చేస్తుంటారని, కానీ మన్మోహన్ సింగ్ దేని గురించీ అడగలేదని చెప్పారు.

ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని పేర్కొన్నారు. ఒక బలమైన మనిషికి ఇదే సంకేతమని డాక్టర్ రమాకాంత్ అభివర్ణించారు. మన్మోహన్ సింగ్ హాస్పిటల్‌కు వచ్చిన ప్రతిసారీ స్వాగతం పలికేందుకు తాము గేటు వద్దకు వెళ్లే వాళ్లమని, అలా చేయకూడదంటూ తమకు చెబుతుండేవారని ప్రస్తావించారు. ఏదైనా చేస్తానని చెబితే ఆయన తప్పకుండా చేస్తారని, మనసు మార్చుకోరని పేర్కొన్నారు.
Manmohan Singh
Manmohan Singh Died
Congress
India

More Telugu News